పద్య కాదంబరి --- అష్టోత్తరశతం సేకరణ-విశ్లేషణ ... Dr. నందివాడ(భట్టిప్రోలు) విజయలక్ష్మి
ప్రార్థనా శ్లోకములు
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్
అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్
లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం
ఆజానుబాహుమరవిందదళాయతాక్షం
రామం నిశాచరవినాశకరం నమామి
జయతు జయతు దేవో దేవకీనందనోయం
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః
***************************************************
రచయిత్రి అభిభాష
అందరికీ నమస్కారం. 24 జులై 2025 నుంచి రోజూ ఓ పద్యం, దాని భావం కూడా నా పాఠకులకు రాసి షేర్ చేస్తున్నాను. చదువుతున్న అందరికీ కృతజ్ఞతలు. కొన్నాళ్ల క్రితం మా సువర్చల అత్తయ్య చెల్లెలు శ్రీమతి భారతిగారు, 'రోజూ ఓ పద్యమో, సుభాషితమో పెడితే బావుంటుంది' అన్నారు. అలా మొదలైంది ఈ పద్య ప్రయాణం. నాకు చిన్నప్పటి నుంచీ తెలిసిన, విన్న, చదివిన గ్రంధాల నుంచి నాకు నచ్చిన పద్యాలను సేకరించి రోజుకొకటి చొప్పున వాటికి వ్యాఖ్యానం చెప్తూ వచ్చాను.
బహుశా ఈ పద్యాలు, శ్లోకాలు ముందే తెలిసిన వారికి చర్వితచర్వణం అనిపించి ఉండవచ్చు లేదా పునశ్చరణ అనిపించీ ఉండవచ్చు. కొత్తగా తెలుసుకుంటున్న వారికి ఆసక్తి దాయకంగా అనిపించీ ఉండవచ్చు. నేను మాత్రం ఆపకుండా, నా పాఠకమిత్రులకు పట్టువదలని విక్రమార్కుడి ముదిమనవరాలి వలె, అపురూపమని నేను భావించిన ఈ పద్యాలను అందించాలనే ఆకాంక్షతో, వరుసగా 108 రోజులపాటు నా బ్లాగ్ లో రాస్తూ, అందరికీ షేర్ చేస్తూ వచ్చాను. ఓ డెబ్బై శ్లోకాలు పూర్తి అయ్యాక అనిపించింది, ఓ నూట ఎనిమిది శ్లోకాల వరకూ చేయాలని. శ్లోకం అంటే సంస్కృత పద్యం అని నిఘంటువులో చూసిన తరువాత, దీనికి "పద్యకాదంబరి-అష్టోత్తరశతం" అని పేరు పెట్టుకున్నాను. దీనికీ ఒక కారణం ఉంది. నా పాఠకదేవుళ్లకి నేను ప్రీతిగా సమర్పించే 'అష్టోత్తరశతపద్యమంజరి' ఇది. అందుకే నూటఎనిమిది పద్యాలు అని ఓ లిమిట్ పెట్టుకున్నాను. నవంబర్ 9, 2025 కి అవి పూర్తి అయ్యాయి. ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. కొందరు ఇవి అన్నీ పుస్తక రూపంలో కావాలని అడిగారు. అందుకే ఈ పుస్తకం వెలుగు చూస్తోంది.
ఈ మాధ్యమంలో ఎందరో పెద్దలు, పండితులు, భక్తులు, రచయితలు పరిచయం అయ్యారు. వారు చూపిన ప్రేమాభిమానాలకు, వారు అందించిన ప్రోత్సాహానికి, వారిచ్చిన సలహాలు, సూచనలకు నేను వారికి ఎంతో రుణపడి ఉంటాను. వారందరికీ నా నమస్కారాలు.
ఈ ప్రయాణంలో నాకెంతో ప్రోత్సాహం ఇచ్చి, నిత్యం నా రచన చూసి వారి అభిప్రాయం పంపించిన శ్రీ ఎరగుడిపాటి రమణారావు గారికి, వారి శ్రీమతి, నేను ముద్దుగా నా 'బంగారు ఉడుత' అని పిలుచుకునే మా రాధికకూ నా కృతజ్ఞతలు. రమణారావుగారు నేను కోరగానే ఎంతో ప్రేమతో చక్కని ముందుమాట రాసి ఇచ్చారు. వారికి నా ధన్యవాదాలు.
మా శ్రేయోభిలాషి, సోదరసమానులు శ్రీ కౌండిన్య శాస్త్రి గారు ఎంతో ఆత్మీయతతో, భావుకతతో వ్రాసి ఇచ్చిన పరిచయ వాక్యాలు అద్భుతం, అపూర్వం. వారి పాండిత్యం, సాహిత్యం పట్ల వారికి ఉన్న మక్కువ, ఆధ్యాత్మికతకు వారు వేసే పెద్ద పీట అమోఘం, అనిర్వచనీయం. కేవలం ముందుమాట వ్రాయడమే కాకుండా, మా దంపతులకు ఈ పుస్తకాలు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అందించమని చేసిన సూచన శిరోధార్యం. ఈ విజ్ఞానం చిన్న పిల్లలకు చేరాలనే వారి ఆశయం మహత్తరం. వారికి మా దంపతులు సర్వదా, సర్వథా రుణపడి ఉంటాము. ఈ పద్యాలు విద్యార్థులకు ఒక కరదీపిక వలే మార్గదర్శి అవుతాయని ఆశిస్తాను.
నిజమే కదా, సంస్కృతాంధ్ర సాహిత్య మధురిమ, ఉదాత్తత, ప్రయోజనము ఆబాలగోపాలానికీ కావలసినదే. ఆ సరస్వతీమాత కురిపించిన వేదవాహినిలో, విద్యాస్రవంతిలో అందరమూ తరించి కృతార్థులవుదాం. పుస్తకాలు ఎప్పుడూ పూజనీయమే, అవి ఎల్లప్పుడూ పఠనీయం, అనుసరణీయం, ఆచరణీయం. వాటిలోని విశేషమైన విషయాలను ఆకళింపు చేసుకుని ఆచరిస్తే, ఉత్తమ జీవన నైపుణ్యాలను అలవరచుకుని, జీవనప్రమాణాలను మెరుగుపరుచుకుని, జీవితానందాన్ని, జీవితాశయాన్ని అందుకుంటాం. పద్యకాదంబరి-అష్టోత్తరశతం చదివినవారు మీ మీ స్పందనలను తెలియచేస్తే సంతోషం. సెలవు.
మీ డా. నందివాడ (భట్టిప్రోలు) విజయలక్ష్మి
9885010650
***************************************************
ముందుమాట
వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం), వేదాంగాలు (శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం), ఉపనిషత్తులు, సూక్తాలు, రామాయణం, మహాభారతం, మహాభాగవతం వంటి ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, శ్రీ శంకర భాగవత్పాదులు రచించిన రచనలు (ఉదాహరణకి — సౌందర్యలహరి, భజగోవిందం, ఆత్మబోధ లాంటివి), భర్తృహరి చెప్పిన సుభాషితాలు, చాణక్యుని నీతిసూత్రాలు, సుమతీ శతకం, గువ్వల చెన్న పద్యాలు, వేమన పద్యాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతము, ఇంకా ఎన్నో— ఇవన్నీ భారతదేశపు ఆధ్యాత్మిక, తాత్విక, నైతిక, సాంస్కృతిక సంపదగా ఎంతో గౌరవించబడుతున్న రచనలు. ఇవి మన సంప్రదాయాన్ని, సంస్కృతిని, ఆధ్యాత్మికతను మరియు జ్ఞాన వారసత్వాన్ని ప్రతిబింబించడమే కాదు, సమాజానికి దారి చూపే మార్గదర్శకాలు కూడా.
ఈ శ్లోకాలు ప్రాచీన సంస్కృతంలో గానీ లేక గ్రాంధిక భాషలో ఉండటంతో వల్ల గానీ, చాలా మందికి అవి అర్థం కావడం కష్టం. అందువల్ల, వాటి, గొప్పతనము, విలువ, అంతరార్థము చాలామందికి తెలిసి ఉండదు. ఈ నేపథ్యంలోనే, ఈ పుస్తక రచయిత్రి పైన చెప్పబడిన సాహిత్యగ్రంథముల నుంచి ఎంతో శ్రద్ధగా ఎన్నుకున్న నూటఎనిమిది శ్లోకాలకు, పద్యాలకు సరళంగా, సులభశైలిలో అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో వివరిస్తూ, వాటి ప్రాముఖ్యతను పాఠకులకు తెలియపరిచేలా కృషి చేశారు.
ప్రతి శ్లోకానికీ తాత్పర్యం మాత్రమే కాదు, దాని లోతైన అర్థం, జీవితానికి, సమాజానికీ ఎలా వర్తిస్తాయో కూడా విశదీకరించారు. అంతేకాక, ఈ శ్లోక సంకలనము ఆధ్యాత్మిక చింతన మరియు వేదాంత ధోరణులకు కూడా మార్గం చూపుతుంది.
ఈ రచయిత్రి ఒక ఆధ్యాత్మిక సాధకురాలు, మంచి విద్యావేత్త, మరియు అనుభవజ్ఞురాలు. ఆమె ఈ పుస్తకంలో తన అనుభవం, అధ్యయనం కలిపి, ఈ రచనను అందించారు. ఇదేకాదు, ఇందులో ఎంచుకున్న శ్లోకాలు మరియు వాటి అర్థాలు – ఏ కాలానికి అయినా సరిపోయే విలువలతో, సందేశాలతో, చైతన్యంతో నిండినవి. ఈ రచయిత్రికి నా హృదయపూర్వక అభినందనలు. పాఠకులు ఈ పుస్తకాన్ని అర్థంతో చదివి, అనుభవంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.
యరగుడిపాటి వెంకట రమణారావు
రిటైర్డ్ ప్రొఫెసర్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం,
గిండి ఇంజనీరింగ్ కాలేజి, అన్నా యూనివర్సిటీ, చెన్నై.
రిటైర్డ్ ప్రొఫెసర్, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ విభాగం,
గిండి ఇంజనీరింగ్ కాలేజి, అన్నా యూనివర్సిటీ, చెన్నై.
***************************************************
ధర్మనాటక మంజూష
శ్లో।। పద్యాని ధర్మబోధాయ, శ్లోకాని శాంతిదా యకమ్।
భక్తిం జనయతి జ్ఞానం,విజయలక్ష్మీకృతం సదా ॥
భావం: పద్యాలు ధర్మాన్ ని బోధిస్తాయి,శ్లోకాలు మనసుకు శాంతిని ఇస్తాయి; జ్ఞానం భక్తి ని పెం చుతుంది, విజయలక్ష్మి గారి రచన అలాంటిదే.
భారతీయ సంస్కృతి అనేది భక్తి , తత్త్వం , శాస్త్రం , నీతి, అనుభవం, సా హిత్యం అనే అనేక అంశాల సమాహారం. అటువంటి వాటినన్నింటిని ఒకే పుస్తకంలో, పద్య శ్లోక రూపంలో, ఏర్చి, కూర్చి ప్రతి దానికి అర్థవంతమైన విశ్లేషణ అందించారు భట్టిప్రోలు విజయలక్ష్మి గారు.
ఈ “పద్య కాదంబరి (అష్టోత్తర శతం)” పుస్తకం పద్యాల సమాహారం మాత్రమే కాదు—భగవద్గీత, ఉపనిషత్తులు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, నీతిశతకాలు, భక్తిసాహిత్యం, మరియు హాస్యం, తత్త్వం, చమత్కా రం కూడా. ఇవన్నీ ఒకే వేదికపై కనిపించే ధర్మనాటక మంజూష.
ఈ గ్రంథం లోని ప్రతి పద్యం భక్తి యొక్క శాంతి, నీతి యొక్క బలం, వేదాంతం యొక్క వెలుగు,
సాహిత్యం యొక్క సౌరభం, జీవితం యొక్క గమ్యం , ఆధ్యాత్మికత యొక్క ఆనందం, ఆచరణ యొక్క ప్రయోజనాలను బోధిస్తాయి.
అంతేకాక - వేదాంతాన్ని మేలుకొల్పి, దేవుని దగ్గరికి తీసుకెళ్లే దారిని చూపి, నడవాల్సిన మార్గం నేర్పి, జీవితానుభవాన్ని బోధించి, హృదయాన్ని పావనం చేస్తాయి.
ఈ గ్రంథంలో ఉన్న పద్యాలలో రచయిత్రి పాాండిత్యం, అనుభవం భక్తి స్పష్టంగా కనిపిస్తాయి. ఆమె explanations చదివినపుడు అవి కేవలం అనువాదం కాదు - జీవితానుభవంతో వచ్చిన లోతైన అర్థవ్యాఖ్య. అందుకే ఈ పుస్తకం పాఠకుడి హృదయాన్ని మాత్రమే కాక, తన బుద్ధిని కూడా మేల్కొలుపుతుంది.
అందుకే నేనంటాను, ఈ గ్రంథం పాఠకునికి ఇస్తుం ది
ప్రతి పద్యంతో ఒక ఆధ్యాత్మిక జ్వాల
ప్రతి భావంతో ఒక నీతి శిక్షణ
ప్రతి శ్లోకంతో ఒక ధర్మబోధ
ప్రతి చమత్కా రంతో ఒక చింతన
ప్రతి వివరణతో వేదాంత బీజం
ప్రతి అక్షరంతో దైవానుభవం
“పద్య కాదంబరి” అంటే కేవలం పద్యాల తోట కాదు —
భక్తి పూదోట, వేదాంత ఫల వనం, నీతి వృక్షం , సా స్హిత్య మల్లెపూల మాలిక.
చివరగా
పద్యం ఒక దీపం, పఠనం ఒక మార్గం,
భక్తి ఒక పుష్పం, భావం ఒక యాగం.
విజయలక్ష్మి కలం నిండ దివ్య ప్రకాశం
పద్య కాదంబరి పాఠకునికి వరప్రసాదం.
కౌండిన్య శాస్త్రి
(ఈ పుస్తక ముద్రణకు దంపతులిద్దరు పార్వతీపరమేశ్వరుల్లా కార్తీకమాసంలో మా ప్రెస్ కి వచ్చినప్పుడు, అంతకుముందే అన్ని పద్యాలు, శ్లోకాలు వాట్సప్ లో చదవి ఉండడం వలన, ప్రింటు చెసి మంచి పనిచేస్తున్నా రు. వీలైతే ప్రతి స్కూ లులో తెలుగు ఉపాధ్యాయునికో లేదా తెలుగులో మొదటి ర్యాంకు వచ్చిన విదార్థికో ఒక పుస్తకం అందిస్తే బాగుంటుంది అన్నా ను, దానికి వారు అంగీకరించి నందుకు శతాధిక ధన్యవాదములు. )
***************************************************
పద్య కాదంబరి --- అష్టోత్తరశతం
సేకరణ-విశ్లేషణ ... Dr. నందివాడ(భట్టిప్రోలు) విజయలక్ష్మి
1
అలంకార ప్రియో విష్ణుః,
అభిషేక ప్రియః శివః,
నమస్కార ప్రియో సూర్యః,
గణపతి స్తర్పణప్రియః.
భావం: "అలంకారం చేస్తే విష్ణువుకి ఇష్టం. అభిషేకం చేస్తే శివుడికి ఇష్టం. నమస్కారాలు చేస్తే సూర్యుడికి ఇష్టం. తర్పణాలిస్తే గణపతికి ఇష్టం". విష్ణువు అలంకార ప్రియుడు. ఆయనకు ఎంత అలంకారం చేస్తామో అంతగా ప్రీతి చెందుతాడు. తన భక్తులు కూడా ఎప్పుడూ అలంకారం చేసుకుని ఉంటే చూడటం కూడా విష్ణువుకి ఒక ముచ్చట. ఈ రహస్యం తెలిసే, గోదాదేవి ధనుర్మాసంలో ముప్ఫయి రోజులూ రకరకాలుగా తనను తాను అలంకరించుకుని, విష్ణువుని మెప్పించి, విష్ణుపత్నియై, విష్ణు సాయుజ్యం పొందింది. శివుడు అభిషేకప్రియుడు. కాసిని నీళ్లు ఆయన మీద పోస్తే చాలు సంతోషించేస్తాడు. అల్పసంతోషి, శీఘ్రసంతోషీ కూడాను. ప్రయత్నించి చూడండి. భక్తీ, శ్రద్ధా మాత్రం ఆ నీటితో కలిపి అభిషేకం చెయ్యండి. సూర్యుడికి నమస్కారాలిష్ఠం. సూర్య నమస్కార భంగిమలన్నీ ఆరోగ్యాన్నీ, శరీరధృఢత్వాన్నీ ఇచ్చేవే. సూర్య కిరణాల నుంచి మనకు, మన చుట్టూ ఉన్న ప్రపంచానికీ పోషణ అందుతుంది. అందుకే సూర్యుణ్ణి పూషా అంటాం. మనకి హితకారి కనుక, సూర్యుడు మన సహజ మిత్రుడు. నమస్కారాలు చేస్తే, సంతోషపడి ఆరోగ్యాన్ని ఇస్తాడు సూర్యుడు. గణపతికి తర్పణాలిస్తే ఇష్టం. గజముఖుడు కదా, నీటిలో జలకాలాడిస్తే మహా ఆనందపడిపోతాడు. గణపతి తృప్తి పడితే, విఘ్నములు రావు. రానివ్వడు. విష్ణువును విశేషంగా అలంకరించండి. విష్ణుకటాక్షం పొందండి. ఆయన మెచ్చేలా మీరూ అలంకరించుకోండి. శివుడు తనివితీరా తడిసేలా రకరకాల ద్రవ్యాలతో, మీ చేతులతో అభిషేకం చేయండి. ఐశ్వర్యాన్ని పొందండి. సూర్యుడికి ఇష్టంగా నమస్కారాలు చేస్తూ, అర్ఘ్యమును ఇస్తూ ఆరోగ్యాన్ని పొందండి. గణపతిపై నీటిని చిలకరిస్తూ, తర్పణాలు ఇస్తూ సంతోషపెట్టండి. విఘ్నాలు నివారించుకోండి.
***************************************************
2
ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్
శ్రియమిచ్ఛేత్ హుతాశన
ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్
మోక్షమిచ్ఛేత్ జనార్దన.
భావం: "ఐశ్వర్యాన్నిచ్చేది ఈశ్వరుడు. శ్రియమును ఇచ్చేది హుతాశనుడు, అంటే అగ్ని. ఆరోగ్యాన్ని ఇచ్చేది భాస్కరుడు. మోక్షాన్నిచ్చేది జనార్దనుడు". ఐశ్వర్యం కావాలంటే శివుణ్ణి కోరండి. అందుకే శివుణ్ణి ఈశ్వరుడు అంటాం. శ్రియాన్ని కలుగచేసేది హోమాగ్ని లోనున్న హుతాశనుడు. అందుకే హోమం చేసిన తరువాత, శ్రియం దేహిమే హుతాశన అని ప్రార్థిస్తాం. ఆరోగ్యాన్నిచ్చేది మాత్రం భాస్కరుడే. చక్కటి ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఉదయ సూర్యుడికి నమస్కారాలు చేస్తాం. ఆ ఎండలో మనకు ఆరోగ్యాన్నిచ్చే కిరణాలు ఉంటాయి. ఇక చివరిగా అందరికీ కావలసినది మోక్షం. మోక్షం ఎవరికి వారే సంపాదించుకోవాలి. అటువంటి మోక్షాన్ని ఇచ్చేది మాత్రం జనార్దనుడే. అంటే శ్రీమన్నారాయణుడే. ఓం నమో నారాయణాయ.
***************************************************
3
వేదమూలమిదం జ్ఞానం,
కృషిమూలమిదం ధాన్యం,
భార్యామూలమిదం గృహం,
ధనమూలమిదం జగత్.
భావం: "జ్ఞానానికి మూలం వేదం. ధాన్యానికి మూలం వ్యవసాయం. గృహానికి మూలం భార్య. ధనం ఈ జగత్తుకే మూలం". ఈ శ్లోకం నరసింహ సుభాషితం లోనిది. జ్ఞానం విద్య నుంచే వస్తుంది. విద్ అనే ధాతువు వేదం నుంచే వచ్చింది. వేదం నుంచే విద్య, విద్య నుంచే జ్ఞానం, కనుక జ్ఞానానికి మూలం వేదమే. కృషి అంటే సేద్యం చేస్తేనే కదా ధాన్యం వచ్చేది, అది తిని మనం బ్రతికేది, కనుక కృషి చెయ్యకపోతే, ధాన్యం రాదు, ధాన్యం లేకపోతే మనమూ ఉండము. కనుక ధాన్యానికి మూలం విపణివీధులు కావు, వ్యవసాయమే. భార్యని ఇలాలు, గృహిణి అంటారు. ఇంట్లో ఎంత మంది ఉన్నా ఇంటికి దీపం ఇల్లాలే. ఇంట్లో దీపం పెట్టేదీ ఆ ఇల్లాలే. నాలుగు గోడలతో కడితే అది ఒక కట్టడం అవుతుందేమో కానీ, దానిని గృహంగా మార్చేది మాత్రం గృహిణే. కనుక గృహానికి భార్యయే మూలం. ఇక చివరి పాదంలో, ఎప్పటికీ పనికి వచ్చే ఒక గొప్ప సత్యం చెప్తున్నాడు కవి. ధనమే ఈ జగత్తుకంతా ఆధారం అని. 'డబ్బు లేనివాడు డుబ్బుకైనా కొరగాడు' అని సామెత. డబ్బుంటే గారు అంటారు, డబ్బు లేకపోతే గాడు అంటారు. అదీ లోకరీతి. కనుక నిస్సందేహంగా ఈ ప్రపంచానికి ధనమే మూలం.
***************************************************
4
పత్రం పుష్పం ఫలం తోయం,
యో మే భక్త్యా ప్రయచ్ఛతి,
తదహం భక్త్యుపహృతమ్,
అశ్నామి ప్రయతాత్మనః.
భావం: "భక్తుడు భక్తిగా ఇచ్చిన పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, తోయము అంటే జలము కానీ నేను స్వీకరిస్తాను" అని శ్రీమద్భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. ఈ శ్లోకం శ్రీమద్భగవద్గీత లోని రాజవిద్యా రాజగుహ్య యోగం అనే నవమ అధ్యాయం లోనిది. భక్తుడు శ్రద్ధాభక్తులతో ఏమి ఇచ్చినా స్వీకరిస్తాను అంటున్నాడు భగవానుడు. ఆఖరికి అది పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా, తోయమైనా సరే, భేదమును చూపక భక్తితో సమర్పించిన దానిని నేను భుజిస్తాను అని భగవానుడు చెప్తున్నాడు అని ఈ శ్లోకం అర్థం.
***************************************************
5
లాలయేత్ పంచవర్షాణి,
దశవర్షాణి దాసవత్ (తాడయేత్),
ప్రాప్తేతు షోడశే వర్షే,
పుత్రం మిత్ర వదాచరేత్.
భావం: "పిల్లలని ఐదేళ్ల వరకు ముద్దుముద్దుగా లాలించి పెంచాలి. పదేళ్ల వరకూ తప్పు చేస్తే కాస్త దండన కూడా ఉండాలి. వారికి చిన్న చిన్న పనులు చేయడమూ నేర్పాలి. అదే పిల్లలకు పదహారేళ్లు వస్తే వాళ్ళను మిత్రుడు వలె చూడాలి" అంటోంది ఋషివాక్యం. పిల్లల పెంపకం ఏ వయసులో ఎలా ఉండాలో చెప్తోంది ఈ శ్లోకం. అనుసరిస్తే మంచిది. ఈనాటి మనస్తత్త్వశాస్త్రం కూడా అదే చెప్తుంది.
***************************************************
6
ధనపతి సఖుడై యుండియు
నెనయంగా శివుడు భిక్ష మెత్తగవలసెన్
దనవారి కెంత కలగిన
దనభాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ
దనవారి కెంత కలగిన
దనభాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ
భావం: ధనాధిపతి అయిన కుబేరుడు తనకు మంచి స్నేహితుడైనప్పటికీ, శివుడికి బిక్షమెత్తడం తప్పలేదు. అలాగే, మన బంధుమిత్రులకు ఏమి వున్నా, ఎంతవున్నా, మన దగ్గర వున్న సొత్తే మనది కానీ, ఇతరుల దగ్గర వున్న సొమ్ము మనది ఎప్పటికీ కాదు. ఇది సుమతీ శతకంలో బద్దెన, చెప్పిన నీతి పద్యం. మనకు ఎంతో ఆత్మీయులైన వారి దగ్గర ఏమి వున్నా, ఏది వున్నా, అది మనది ఎప్పటికీ కాదు. అది స్వయంగా వారు ఇస్తే తప్ప దానిని అనుభవించకూడదు. ఒకసారి వారు ఇచ్చాక, ఆ వస్తువు మనది అయిపోతుంది కనుక, దానిని వాడుకోవచ్చు. పరుల సొత్తుపై వ్యామోహం వద్దు అని సుమతీ శతకకారుడు హెచ్చరిస్తున్నాడు. నిజానికి కుబేరుని ధనాధిపతిని చేసింది సాక్షాత్తూ ఈశ్వరుడే. అయినప్పటికీ కుబేరుని సొత్తు శివునిది కాదు అంటున్నాడు కవి. ఎందుకంటే శివుడు ఆ అధికారాన్ని కుబేరునికి ఇచ్చేశాడు కదా. అంటే, ఒకసారి పరులకు ఇచ్చివేశాక ఆ వస్తువుపై ఇక ఇచ్చినవారికి హక్కు లేదు.
***************************************************
7
కృషితో నాస్తి దుర్భిక్షం
జపతో నాస్తి పాతకం
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.
భావం: "కృషి అంటే వ్యవసాయం చేస్తే దుర్భిక్షం, కరువు ఉండదు. కేవలం వ్యవసాయమే కాదు, ఏ పనైనా సరే చక్కగా చేస్తే ఆ విషయంలో లోటు ఉండదు. పాతకాలు అంటే మహాపాపాలు కూడా జపం చేస్తే నశిస్తాయి. అలాగే మౌనంగా ఉంటే కలహాలే రావు. చివరిగా ఎప్పుడూ మేలుకొని, అంటే జాగరూకతతో ఉండేవారికి భయమే ఉండదు". వ్యవసాయం వలననే ఆహారం దొరుకుతుంది కనుక, సేద్యం చేస్తూ ఉంటే కరువులు రావు. నిత్యం జపం చేస్తూ ఉంటే మహా మహా పాతకాలే ఆ జపాగ్నిలో భస్మం అయిపోతాయి. మౌనంగానే, మితభాషణం చేస్తే తగవులు వచ్చే అవకాశమే ఉండదు. అదేవిధంగా ఎప్పుడూ అన్నీ గమనిస్తూ, మెలకువగా ఉండేవాడికి భయమే ఉండదు. ఇది మన ఋషులు చెప్పిన ఒక సూక్తి.
***************************************************
8
శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతం
శోకో నాశయతే సర్వం నాస్తి శోకసమో రిపుః
భావం: శోకిస్తూ కూర్చుంటే ధైర్యము కోల్పోతాం. నేర్చిన జ్ఞానం కోల్పోతాం. శోకము అన్నిటినీ నాశనం చేస్తుంది. కనుక శోకము కన్నా శత్రువు లేడు.
కోపో నాశయతే ధైర్యం కోపో నాశయతే శ్రుతం
కోపో నాశయతే సర్వం నాస్తి కోప సమో రిపుః
భావం: కోపము వలన ధైర్యము కోల్పోతాం. నేర్చిన జ్ఞానం కోల్పోతాం. కోపము అన్నిటినీ నాశనం చేస్తుంది. కనుక కోపము కన్నా శత్రువు లేడు.
సుమతీశతకంలో దీనినే తన కోపమే తన శత్రువు అని చెప్పాడు సుమతీ శతక కారుడు
తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ !
భావం: ఎవరి కోపం వారికే శత్రువు, ఎవరి శాంతం వారికి రక్ష. ఇతరుల పట్ల చూపించే దయనే వారి చుట్టం. ఎవరి సంతోషం వారికి స్వర్గం. ఎవరి దుఃఖం వారికి నరకం. కనుక కోపాన్ని అదుపులో ఉంచుకోండి. దుఃఖాన్ని నివారించుకోండి. శాంతంగా ఉండండి, దయగా ఉండండి, సంతోషంగా ఉండండి.
***************************************************
9
ఆచార్యాత్ పాదమాదత్తే
పాదం శిష్యః స్వమేథయా
పాదం సబ్రహ్మచారిభ్యః
పాదం కాలక్రమేణ చ
భావం: "మొత్తం విద్యను నాలుగు భాగాలనుకుంటే, పావు భాగం గురువు నేర్పిస్తాడు. పావుభాగం శిష్యుడు తన బుద్ధి వివేకంతో ఆలోచించి తర్కించి నేర్చుకోవాలి. మరొక పావుభాగం సహ విద్యార్ధులతో చర్చలు జరిపి నేర్చుకోవాలి. మిగిలిన పావుభాగం జీవితంతో తనకెదురైన అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు". మహాభారతం లోని ఉద్యోగపర్వం లోని శ్లోకం ఇది. ఎంత ధీమంతులైనా జీవితపర్యంతం విద్యార్థులే అంటోంది ఈ శ్లోకం. కొంత గురువు నేర్పిస్తే, కొన్ని తోటి విద్యార్థులతో కలసి నేర్చుకుంటే, ఇంకొన్ని తనంతట తానే నేర్చుకుంటాడు విద్యార్థి. ఎంత నేర్చినా, ఎప్పటికీ ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఆ విద్యను జీవితాంతం తనకు ఎదురైన సంఘటనలు, సందర్భాల ద్వారా నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు నేర్చుకోవడం మానేస్తామో, అప్పుడు ఆ జీవనయానం ముగిసినట్లే. అన్నీ నేర్చేసుకున్నాను అని అనుకునేవాడు అజ్ఞాని. నేర్చుకున్నది కొంత, నేర్చుకోవాల్సినది ఎంతో అని గ్రహించిన వాడు జ్ఞాని.
***************************************************
10
పసరంబు పంజైన బసులకాపరి తప్పు. ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు.
భార్య గయ్యాళైన బ్రాణనాథుని తప్పు. తనయుడు దుష్టయిన తండ్రి తప్పు.
సైన్యంబు చెదిరిన సైన్యనాథుని తప్పు. కూతురు చెడుగైన మాత తప్పు.
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు. దంతి దుష్టయిన మావంతు తప్పు.
ఇట్టి తప్పులెరుంగక ఇచ్చ వచ్చినటుల, మెలగుదురిప్పుడీ యవని జనులు.
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! దుష్టసంహార! నరసింహ దురితదూర!"
భావం: 'పశువు సరిగా పని చేయకపోతే పశులకాపరిదే తప్పు. ప్రజలు చెడ్డవారైతే పాలకునిది తప్పు భార్య గయ్యాళిదైతే భర్తదే తప్పు. కొడుకు దుష్టుడైతే తండ్రి తప్పు, సైన్యము బెదరి చెదిరితే సైన్యాధిపతి తప్పు. కూతురు చెడిపోతే తల్లి తప్పు. గుర్రం మాట వినకుంటే దానిని ఆరోహించిన వానిదే తప్పు. ఏనుగు దుష్టు అయితే మావటి తప్పు. జనులు తమ తప్పులు ఇన్ని తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వుంటున్నారు", అని ధర్మపురి నివాసుడైన నరసింహునితో చెప్తున్నాడు కవిశేషప్ప. పశులకాపరి తన పశువులను చెప్పుచేతలలో ఉంచుకోలేకపోతే ఆతనికి పశుపాలన చేతకానట్లే. ప్రభువాజ్ఞ మీరి ప్రజలు ప్రవర్తిస్తుంటే, ఆ రాజుకు రాజ్యపాలన రానట్లే. సైన్యం తాను ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకపోతే, ఆ సైన్యాధిపతిదే చేతకానితనం. భార్యను తన మాట వినేలా చేసుకోలేని భర్త, కొడుకు తండ్రి మాట మీరి తిరుగుతుంటే ఆ తండ్రి, తల్లి మాటను లెక్కించని కూతురున్న ఆ తల్లి కూడా పనికిరానివారే. గుర్రం రౌతు మాట వినకుంటే ఆ రౌతుదే దోషం. తన సూచనల్ని పట్టించుకోని ఏనుగు ఉన్న మావటి కూడా అంతే. జనం ఇన్నిన్ని రకాలైన తప్పులను తమలో పెట్టుకుని, వాటిని సరి చేసుకోకుండా జీవనం సాగించేస్తున్నారు. ఓ ధర్మపురి నరసింహా, కాస్త చూడవయ్యా అంటున్నాడు ఈ పద్యంలో కవిశేషప్ప.
***************************************************
11
కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ.
భావం: ఎవరైనా తమ తమ స్థానములలో ఉన్నప్పుడే వారి మధ్య చక్కని స్నేహం కొనసాగుతుంది. ఎపుడయితే ఆ హద్దులు దాటుతారో ఆ మిత్రులే శత్రువులుగా మారతారు. ఉదాహరణకు "కమలము నీటిలో ఉన్నప్పుడే సూర్యకాంతికి వికసిస్తుంది. ఎపుడైతే నీటిలో నుంచి బయటకు వస్తుందో ఆ ఎండకే అది వాడిపోతుంది. నీటిలో ఉన్నప్పటి మిత్రుడే బయటకు రాగానే శత్రువు వలె పువ్వు వాడిపోవడానికి కారణం అవుతున్నాడు". కనుక ఎంత స్నేహితులైనా కూడా హద్దులు చూసుకుని మెలగాలి అని సుమతీ శతకకారుడు చెప్తున్నాడు. ద్రోణుడు, ద్రుపదుడు బాల్యంలో గురుకులంలో సహాధ్యాయులు. కానీ పెరిగి పెద్దవారైన తరువాత, తమ తమ స్థితిగతులలో ఏర్పడిన అంతరాల వలన స్నేహం పోయి శత్రుత్వం ఏర్పడింది. ఎంత మిత్రుడైనా, మన తాహతు చూసుకుని, పరిస్థితులను గమనించి, అప్పటి సందర్భాన్ని అర్థం చేసుకుని మెలిగితే మంచిది.
***************************************************
12
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్
భావం: "సమస్త జీవుల ఉదరములలోను నేను వైశ్వానరుడనే జఠరాగ్నివలె ఉండి, వారు భుజించే ప్రాణ, అపానములతో కూడిన భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములనే నాలుగు రకములైన ఆహారమును జీర్ణము చేస్తున్నాను." ఇది గీతా వాక్యం. భోజనం చేసే ముందు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేస్తున్న ఆ భగవానుడికి నమస్కరిస్తూ ఈ శ్లోకం స్మరిస్తే మంచిది. ప్రతిజీవికి కడుపులో ఒక అగ్నిహోత్రం ఉంటుంది. అదే జఠరాగ్ని. అందుకే తెలిసో, తెలియకో, ఆకలి వేస్తే, కడుపు కాలిపోతోంది, కడుపు మండిపోతోంది అంటూ ఉంటాం. ఆ జఠరంలో ఉండే అగ్నిహోత్రుడే వైశ్వానరుడు. గీతాచార్యుడు చెప్తున్నాడు, మీరు తినే అన్ని రకములైన ఆహారాన్ని జీర్ణము చేసి, దానిని శక్తిగా మార్చి అందించేది నేనే అని. ఈ శ్లోకం శ్రీమద్భగవద్గీతలో పురుషోత్తమప్రాప్తి యోగమనే పంచదశోధ్యాయములో ఉన్నది.
***************************************************
13
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్యమప్రియం
ప్రియంచ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతనః
భావం: "సత్యమే పలుకు. ప్రియమే పలుకు. అప్రియమైన సత్యాన్ని పలుకకు. ప్రియం కదా అని అసత్యం పలుకకు. ఇదే సనాతనధర్మం", అని మనుస్మృతి చెప్తోంది. ఈ శ్లోకం చూస్తూ ఉంటే, మనువు మనుష్యులను ఎంత విశ్లేషించి మనుస్మృతిని చెప్పాడో కదా అనిపిస్తుంది. మనిషికి కేవలం ప్రియమైనవే కావాలి. ప్రేయస్సు, శ్రేయస్సు అనేవి రెండు విషయాలు. మనశ్శరీరాలకు ప్రియమైనవి ప్రేయస్సైతే, మనిషికి అసలైన హితమునును చేకూర్చేది శ్రేయస్సు. సత్యం ఇచ్చేది శ్రేయస్సేతే, ప్రియం కూర్చేది ప్రేయస్సు. మనిషికి ఎప్పుడూ ప్రీతి కూర్చే మాటలే కావాలి, కనుక సత్యమే చెప్పు, ప్రియమే చెప్పు, సత్యమైనా సరే, అప్రియమైన మాటలు చెప్పకు అంటున్నాడు మనువు.
***************************************************
14
"సులభాః పురుషాః రాజన్ సతతం ప్రియవాదినః,
అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః"
భావం: "ఓ రాజా, నిత్యమూ నీకు ప్రియమైన మాటలు చెప్పేవారు సులభంగా దొరుకుతారు. కానీ అప్రియమైనా పథ్యమైన మాటలు చెప్పేవారూ, వినేవారూ కూడా దొరకటం కష్టం". ఈ శ్లోకం వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ ప్రారంభంలో, సీతను రాముడికి ఇచ్చేయమని చెప్తూ విభీషణుడు రావణుడితో అంటాడు. ప్రేయస్సును కూర్చే మాటలు, అంటే మెచ్చుకోలు మాటలు చెప్పేవారు, వాటిని విని ఆనందించేవారూ కొల్లలు. కానీ శ్రేయస్సును కూర్చే మాటలు అప్రియమైనవైతే చెప్పేవారూ భయపడో, మౌనంగా ఉండో చెప్పరు. అలాగే అటువంటి హితకరమైన, అప్రియమైన మాటలు వినేవారూ వినడానికి ఇష్టపడరు. అంటే, ఎప్పుడూ పొగడ్తలనే వినేవారు, విమర్శలను తట్టుకోలేరు.
***************************************************
15
ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః
భావం: "ఎవరైనా తమ ఆత్మను తామే ఉద్ధరించుకోవాలి. అంతేకానీ ఆత్మను దిగజారనీయకూడదు.
అంటే ఆత్మను పతనం కానివ్వరాదు. ఆత్మకు ఆత్మే మిత్రుడు, శత్రువు కూడా". ఈ వాక్యాలు శ్రీమద్భగవద్గీతలో ఆత్మసంయమయోగంలో గీతాచార్యుడు చెప్పాడు. ప్రతివారికీ మనస్సు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి కష్టమైనా ధర్మం వైపు వెళ్ళమంటే, మరొకటి తేలిక కనుక అధర్మం వైపుకి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. అందుకే మన ఆత్మ మనకే ఒక్కోసారి మిత్రుడు, ఒక్కోసారి శత్రువు అవుతోంది. కష్టమైనా నిలబడి ఋజుమార్గంలో, ధర్మమార్గంలో నడిస్తే మనల్ని మనమే పతనం కాకుండా కాపాడుకుని ఉద్ధరించుకుంటాం. మనస్సుని నియత్రించుకుంటే ఆత్మోద్ధరణ, లేకపోతే ఆత్మపతనం. ఈ ప్రక్రియలో ప్రతివారూ తమను తామే నిలబెట్టుకోవాలి. ఏ దేవుడైనా, ఏ గురువైనా ఆ మార్గం వరకూ దారి చూపిస్తారే కానీ, ఆ మార్గంలో స్థిరంగా నడవాల్సింది మాత్రం ఎవరికి వారే. అందుకే "ఉద్ధరేదాత్మనాత్మానం" అన్నాడు గీతాచార్యుడు.
***************************************************
16
అతి దానాత్ హతః కర్ణః
అతి లోభాత్ సుయోధనః
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
భావం: "అతిగా దానం చేసి కర్ణుడు, మితిమీరిన లోభంతో దుర్యోధనుడు, అతి కామంతో రావణుడు ప్రాణాలు కోల్పోయారు". అందుకే అతిని ఎప్పుడూ వదిలెయ్యాలి. అడిగినవాడికి లేదనకుండా ఇవ్వాలనే అతి దాన గుణాన్ని వదులుకోలేని కర్ణుడు తన తండ్రి యైన సూర్యభగవానుడి వరంగా పుట్టుకతో ఇచ్చిన సహజ కవచ కుండలాలు వదులుకున్నాడు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయాడు. దుర్యోధనుడు అన్నీ తనకు మాత్రమే కావాలనే విపరీతమైన లోభంతో, తనది కాని రాజ్యాన్ని అతి లోభంతో కోరుకుని తదనంతరం జరిగిన యుద్ధంలో తన ప్రాణాలే కాక, తనతో ఉన్న అందరి మరణానికీ కూడా కారణమయ్యాడు. కోరిన ప్రతి స్త్రీ పొందూ తనకు కావాలనే మితిమీరిన కామం వలన రావణుడు సీతను అపహరించి రాముడి చేతిలో మరణించాడు. అందుకే ఎప్పుడూ అతిగా పోకూడదు. అతి పనికిరాదు, పైగా ప్రాణాంతకం. కనుక అతిని ఎప్పుడూ వర్జించాలి.
ఈ శ్లోకానికే మరో పాఠాంతరం కూడా ఉంది.
అతి దానాత్ బలిర్నష్టః,
అతి మానాత్ సుయోధనః,
అతి కామాత్ దశగ్రీవః,
అతి సర్వత్ర వర్జయేత్.
భావం: "అతిగా దానం చేసి బలిచక్రవర్తి, మితిమీరిన అభిమానంతో దుర్యోధనుడు, అతి కామంతో రావణుడు ప్రాణాలు కోల్పోయారు". అందుకే అతిని ఎప్పుడూ వదిలెయ్యాలి.
***************************************************
17
అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః
కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షరసముద్భవమ్
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్
భావం: "ప్రాణులన్నీ అన్నము వలననే జీవిస్తున్నాయి. ఆ అన్నము మేఘము వలన వస్తున్నది. ఆ మేఘము యజ్ఞము వలన ఏర్పడుతున్నది. ఆ యజ్ఞము కర్మ వలన జరుగుతున్నది. ఆ కర్మలు వేదములో చెప్పబడినవి. ఆ వేదములు పరమాత్మ చేత చెప్పబడినవి. అందువలన యజ్ఞములో పరమాత్మయే ప్రత్యక్షంగా వున్నాడు". ఈ శ్లోకములు శ్రీమద్భగవద్గీతలో కర్మయోగంలో భగవానుడే స్వయంగా చెప్పాడు. యజ్ఞములన్నీ ఆ పరమాత్మ సాక్షి గానే, ఆ పరమాత్మ సమక్షం లోనే జరుగుతున్నాయి. ఆ యజ్ఞముల విధివిధానములు గురించి కూడా ఆ పరమాత్మే వేదముల ద్వారా చెప్పాడు. ఆ వేదములలో చెప్పిన విహిత కర్మల ఆధారంగానే యజ్ఞములు నిర్వహించ బడుతున్నాయి. అటువంటి వేదవిహితములైన యజ్ఞముల వలన మేఘములు ఏర్పడి, అవి వర్షిస్తున్నాయి. ఆ వర్షముల వలన పంటలు పండి జీవులన్నిటికీ అన్నము అందుతున్నది. ఆ అన్నము తిని జీవులన్నీ జీవిస్తున్నాయి. కనుక వేదవిహితములైన యజ్ఞకర్మల వలన జీవులకు ఆహారము అందుతోంది. ఆ ఆహారము వలన పొందిన శక్తి వలన మిగిలిన అన్ని కార్యములూ చేయగలుతున్నాము. ఉదాహరణకు అన్నము తినడం ఒక యజ్ఞం. ఆ యజ్ఞం వలన కడుపులో వున్న వైశ్వానరుడనే జఠరాగ్ని తృప్తి చెంది, ఆ యజ్ఞఫలితాన్ని మనకు అందిస్తున్నది. తద్వారా రక్తమాంసములు, శుక్లశోణితములు ఏర్పడి జీవనచక్రము ముందుకు సాగుతున్నది.
***************************************************
18
ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాః
విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి
ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాః
విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి
నీతిశతకం---భర్తృహరి
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై,
యారంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్,
ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై,
ప్రారబ్దార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞా నిథుల్ గావునన్
తెలుగు అనువాదం---ఏనుగు లక్ష్మణకవి
భావం: "అధములు ఎప్పుడు ఏవిఘ్నాలు వస్తాయో అని భయంతో అసలు ఏపనినీ మొదలే పెట్టరు. మధ్యములు పనిని మొదలుపెడతారు కానీ, విఘ్నాలు ఎదురుకాగానే ఆ పనిని ఆపేస్తారు. ఇక ధీరులైనవారు ఎన్ని విఘ్నాలు వచ్చినా దాటుకుంటూ, ఆ ఆటంకాలని పరిష్కరించుకుంటూ, రెట్టించిన ఉత్సాహంతో పనిని దిగ్విజయంగా పూర్తిచేస్తారు". ఈ సంస్కృత శ్లోకం భర్తృహరి తన నీతిశతకంలో చెప్పాడు. మనుష్యులలో అధములు, మధ్యములు, ధీరులు అని మూడు రకాలు వుంటారు. వారి లక్షణాలు ఇవి అని భర్తృహరి చెప్పాడు. అవే శ్లోకాలను తెలుగులోకి ఏనుగు లక్ష్మణకవి చాలా సరళంగా అనువదించాడు. అధములు ఎక్కడ పని ఆగిపోతుందో అనే సాకు చూపి, ఏపనీ చెయ్యకుండా పరాన్నభుక్కులై జీవితం గడిపేస్తారు. మధ్యములు వారికన్నా కొంచెం నయం. వారు కొద్దిసేపు పనిచేసి, అడ్డంకి ఏదైనా రాగానే ఆ పని ఆపేసి చతికిలబడతారు. కానీ ధీరులు ప్రజ్ఞానిధులు కనుక, వారికి ఎదురైన విఘ్నాలను చూసినా ఏ భయమూ లేకుండా, వాటిని ఉత్సాహంతో ఎదుర్కొని ఆ విఘ్నాన్ని పరిష్కరించి ఆ పనిని సాధించి గెలుస్తారు.
***************************************************
19
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః
తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్
భావం: "మనుష్యులందరు వారి వారి గుణ, కర్మలను అనుసరించి నాలుగు వర్ణములుగా విభజించబడ్డారు. వారిని నేనే ఆ విధంగా విభజించినా, ఆ కర్మకు సనాతనుడైన నేను కర్తను కాను", అని భగవానుడు శ్రీమద్భగవద్గీతలో జ్ఞానయోగంలో చెప్పాడు. గుణాలు మూడు, సత్వ, రజో, తమో గుణాలు. ఈ మూడు గుణములను బట్టి మనుష్యులు వివిధ కర్మలు చేస్తూ వుంటారు. కేవలము సత్వగుణమే కలవారు శాంతి, ఇంద్రియనిగ్రహం కలిగి వుండి, జపము, తపము, బోధన వంటి పనులు చేస్తూ వుంటారు. వీరు మొదటి వర్ణము వారు. వీరిని బ్రాహ్మణులు అంటారు. అంటే ఈ లక్షణములు వున్నవారినే బ్రాహ్మణులు అంటారు, అని శ్రీమద్భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. సత్వగుణము కొద్దిగా, రజోగుణం ఎక్కువగా వున్నవారు రెండవ వర్ణం వారు. వీరిని క్షత్రియులని అంటారు. వీరు ధైర్యము, శౌర్యము, సాహసముతో, పాలన చేయగలిగే శక్తి సామర్ధ్యములను కలిగి వుంటారు. కనుక ఈ లక్షణములు ఎవరిలో ఉన్నవో వారే క్షత్రియవర్ణం వారు. సత్వగుణము కొద్దిగా, రజోగుణము, తమోగుణము కూడా వున్నవారు మూడవ వర్ణం వారు. వీరిని వైశ్యులంటారు. వీరు వాణిజ్యము, వ్యవసాయము చేస్తూ, పశుపాలన, ముఖ్యంగా గో సంరక్షణ చేస్తూ వుంటారు. ఈ లక్షణములు కలవారు వైశ్యులు అని గీతాచార్యుడు చెప్పాడు. ఇక నాలుగవవర్ణం వారైన శూద్రులు రజోగుణము తక్కువగా, తమోగుణము ఎక్కువగా కలిగి వుండి, ఇతర సేవా కార్యక్రమాలను చేస్తూ వుంటారు. ఈ విధంగా మనుష్యులను వారి వారి గుణము, కర్మములను బట్టి నాలుగు వర్ణములుగా తానే విభజించినప్పటికీ, తాను సనాతనమైన పరబ్రహ్మము కాబట్టి, ఆ కర్మకు తాను కర్తను కాను అని గీతాచార్యుడు అంటున్నాడు. అంటే పరమాత్మకు ఏ కర్మలూ అంటవు, ఏ గుణములూ వుండవు. మొత్తం మీద అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ నాలుగు వర్ణాలు నాలుగు రకాలైన లక్షణాలు కల వ్యక్తులు అని. ప్రతివారు తమలో ఏ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయో గమనించుకుని తమని తాము ఆ వర్ణం వారు అని గుర్తించాలి. అంతేకాదు, తమను తాము నియంత్రించుకుంటే, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటే శాంతి, సహనము అలవరచుకుంటే, విశ్వామిత్రుడి వలె వర్ణమును కూడా మార్చుకోగలుగుతారు. కానీ ఈ మూడుగుణములూ కూడా జీవనం కొనసాగించడానికి ఎంతో అవసరం. ఏ గుణము ఉపయోగము ఆ గుణానిదే. భగవంతుని సృష్టిలో నిరర్ధకమైనది ఏదీ లేదు.
***************************************************
20
సీసము:
కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి గగన భాగంబెల్ల గప్పికొనగ,
నురికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల,
చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటము జార,
నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని క్రీడి మరల దిగువ,
తేటగీతి:
కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువుమర్జునాయంచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు
భూమిక: కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. భీష్ముడు అర్జునుడు మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. కురువృద్ధుడైన భీష్ముడు విజృంభించి బాణాలు సంధిస్తున్నాడు. ఆ బాణవృష్టి అర్జునుడినే కాకుండా ఒక్కోసారి రథసారథి యైన శ్రీకృష్ణుడినీ తాకుతున్నాయి. దానితో కృష్ణుడికి కోపం వచ్చింది. ఆయుధం పట్టను, సారథ్యం మాత్రమే చేస్తాను అని ముందే చెప్పిన శ్రీకృష్ణుడు చేతిలో చక్రం పట్టుకుని కోపంతో, "ఈ భీష్ముడిని చంపేసి నిన్ను కాపాడతాను అర్జునా", అంటూ రథం పైనుంచి కిందకు దూకాడు. ఈ సన్నివేశం పోతన రాసిన భాగవతం లోనిది. ఈ పద్యం ముందు జరిగిన సన్నివేశం అది. ఇప్పుడు పద్యభావం చెప్పుకుందాం.
భావం: ఒక్కసారి వేగంగా ఊపిరి బిగబట్టి రథం మీద నుంచి దూకుతున్నపుడు, శ్రీకృష్ణుని కర్ణ కుండలాలు వేగంగా ఊగాయి. వాటి కాంతి ధగద్ధగాయమానంగా ఆకాశమంతా విస్తరించింది. వేగంగా దూకడం వలన ఉదరం అంతా కదిలి, కడుపు లోపల వున్న జగత్తులన్నీ అల్లల్లాడిపోయాయి. చక్రం పట్టుకుని దూకే హడావుడిలో భుజం పైనుంచి పీతాంబరం కాస్త జారింది. "మాట తప్పద్దు కృష్ణా, యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను అన్నావు. నా శక్తి మీద నాకు నమ్మకం వుంది. నన్ను నగుబాటు చెయ్యకు" అంటూ అర్జునుడు కూడా ఆ వెనుకే రథం దిగి శ్రీకృష్ణుని బ్రతిమాలుతున్నాడు. అప్పుడు భీష్ముడికి శ్రీకృష్ణుడు, ఏనుగు మీదకు ఆవేశంగా దూకబోతున్న సింహం వలె కనిపించాడు. "ఏమైనా సరే, ఈనాడు భీష్ముడిని చంపి నిన్ను రక్షిస్తాను అర్జునా" అంటూ ముందుకు ఉరుకుతున్నాడు కృష్ణుడు. ఇది చూసి, "ఆ జగన్నాథుని చేతిలో మరణించడం కన్నా ఉత్తమమరణం ఏముంటుంది. ఆ దేవదేవుడే దిక్కు నాకు" అని భీష్ముడు అస్త్రాలు వదిలేసి, చకచకా రథం దిగి శ్రీకృష్ణుడి ముందు కైమోడ్చి, మోకాళ్లపై కూర్చుని నమస్కరించాడు, "దేవాదిదేవా, నీవే దిక్కు" అంటూ. ఈ సీస, తేటగీతి పద్యాల భావం ఇది. భీష్ముడికి తండ్రి శంతనుడు ఇచ్ఛామరణ వరం ఇచ్చాడు. ప్రపంచంలో ఎవరికీ ఇటువంటి వరం లేదు. మరణాలు నియంత్రించే విద్య ఇంకా మనకు అందలేదు. ప్రకటన కాస్త ముందో, వెనుకో చేయచ్చేమో కానీ, మరణాన్ని నియంత్రించలేము. అయినప్పటికీ శంతనుడు పుత్రవాత్సల్యంతో ఈ వరం భీష్ముడికి ఇచ్చేశాడు. శ్రీకృష్ణుడు స్వయంగా పరమాత్మ కనుక, ఈ వరం భీష్ముడికి ఉపయోగపడకుండా చూడాలి, లేకపోతే, ఇప్పుడే నా చేతిలో మరణిస్తే, ఈ అష్టమ వసువు తన పాపపుణ్యాల ఋణం తీర్చడానికి తిరిగి జన్మ ఎత్తాలి కదా, అని ఆలోచించి, అర్జునుని ప్రార్థనకు తగ్గినట్టు నటిస్తూ, నిదానపడ్డాడు. కానీ భీష్ముడయితే శ్రీకృష్ణుడి చేతిలో మరణం కావాలన్న కోరికను ప్రకటించి, తన ఇచ్ఛామరణ వరాన్ని వాడేసుకున్నాడు. ఎవరికీ లేని ఇటువంటి వరాన్ని, భీష్ముడికి పనికి రాకుండా చేయడానికి గాను ఇది అంతా శ్రీకృష్ణుడు చేసిన లీల కావచ్చు. మొత్తానికి తన తండ్రి శంతనుడిచ్చిన వరాన్ని భీష్ముడు వాడుకున్నప్పటికీ అది నిష్ప్రయోజనం అయింది. అంతా శాంతపడ్డాక తిరిగి ముగ్గురూ యధావిధిగా తమ తమ స్థానాలకు వెళ్లి యుద్ధం కొనసాగించారు. తరువాత భీష్ముడు అంపశయ్యపై చాలా బాధను అనుభవించి, అంత బాధ తాను తనకు ఎందుకు అనుభవించవలసి వచ్చిందో చెప్పాడు కూడా.***************************************************
21
అమంత్రం అక్షరం నాస్తి,
నాస్తి మూలమ్ అనౌషధమ్,
అయోగ్యః పురుషో నాస్తి,
యోజకః తత్ర దుర్లభః
***************************************************
22
సహసా విదధీత న క్రియాం
అవివేకః పరమాపదాం పదమ్
వృణుతే హి విమృశ్యకారిణం
గుణలుబ్ధాః స్వయమేవ సంపదాః
భావం: "ఏపనీ తొందరపడి చేయకూడదు. అలా తొందరపడే అవివేకులకు పెద్ద పెద్ద ఆపదలు కలుగుతాయి. కనుక తొందర పడకుండా విషయాన్ని చక్కగా విమర్శపూర్వకంగా తరచి చూసి ఏ పనైనా చేయాలి. అటువంటి తెలివైన వాణ్ణి సంపదలు వాటంతట అవే వరించి చేరతాయి". ఈ శ్లోకం మహాకవి భారవి రాసిన కిరాతార్జునీయం లోనిది. ఈ శ్లోకం వెనుక ఒక చిన్న కథ ఉంది. తనను ఏనాడూ పొగడని తండ్రి మీద క్రోధంతో, తన తండ్రినే బండరాయితో మోది చంపాలనుకుంటాడు భారవి. బిడ్డలని పొగిడితే వారికి ఆయుక్షీణమని, తండ్రి తనను పొగడలేదని తెలుసుకున్న తరువాత పశ్చాత్తపంతో, తండ్రి ఇచ్చిన శిక్షను స్వీకరించి కొన్నాళ్ళు తన అత్తవారింట్లో ఉంటాడు. ఆ రోజుల్లో, డబ్బు అవసరం వచ్చి, తాను రచిస్తున్న కిరాతార్జునీయం అనే గ్రంధం నుంచి ఈ శ్లోకాన్ని ఒక వైశ్యుడికి తాకట్టు పెడతాడు. కొన్నాళ్ల తరువాత ఆ వైశ్యుడు ఒకసారి తొందరపడి, తన భార్యను అపార్థం చేసుకుని, తన పుత్రుడిని వధించబోతాడు. ఆ సమయంలో ఈ శ్లోకం కంటపడి, ఆవేశంలో కొడుకుని చంపకుండా నిలకడగా వివరం తెలుసుకుంటాడు. ఆ కృతజ్ఞతతో భారవికి సన్మానం చేసి, కానుకలిచ్చి ఋణం తీర్చుకుంటాడు. ఓ ప్రాణాన్ని కాపాడిన ఘనత ఈ శ్లోకానిది.
***************************************************
23
దేహో దేవాలయః ప్రోక్తో
జీవో దేవ స్సనాతనః
త్యజేదజ్ఞాన నైర్మాల్యం
సోహం భావేన పూజయేత్.
భావం: "భాగవతుడు, అంటే భక్తుడు, తన దేహాన్నే దేవాలయంగా భావించాలి. అంతేకాదు, తనలో ఉన్న జీవుడే సనాతనమైన భగవత్ స్వరూపమని గ్రహించాలి. పూజా నిర్మాల్యమే అజ్ఞానం అని తెలుసుకోవాలి. ఆ అజ్ఞానమనే నిర్మాల్యాన్ని వదిలి, పరమాత్మను, నీవే నీను అనే అద్వైత భావంతో పూజించాలి". ప్రతివ్యక్తీ తన దేహాన్నే ఆ భగవంతుడు కొలువున్న దేవాలయమని తెలుసుకోవాలి. తనలో ఉన్న జీవుడే సాక్షాత్తూ ఆ భగవంతుడని అర్థం చేసుకోవాలి. తన అజ్ఞానమే భగవత్ నిర్మాల్యమని గ్రహించి ఆ అజ్ఞానమనే నిర్మాల్యాన్ని వెంటనే వదిలేసుకోవాలి. జీవుడే దేవుడనే సత్యం తెలుసుకుని పూజించుకోవాలి.
***************************************************
24
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి
భావం: "చక్కగా పాలిచ్చే గోమాత పాల కోసం లేగదూడలు అంబా అని అరుస్తుంటే, తెల్లవారుతూనే గడసరి గొల్లవాళ్ళు, తమ వ్యాపారం కోసం, లేగదూడలని కట్టేసి, ఆవుపాలు పితుక్కుని అమ్ముకుని డబ్బు చేసుకుంటున్నారు". స్థూలంగా చెప్పాలంటే ఈ పద్యభావం ఇదే. కానీ ఈ పద్యరచయిత దేశభక్తుడైన శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు. ఆయన ఎంతో గడుసుగా తన మనోభావాలను పద్యరూపంలో వెల్లడించారు. ఆయన ఈ పద్యాన్ని 1907 లో రాశారు. ఆ రోజుల్లో మనం తెల్లవారు అని పిలుచుకునే బ్రిటిష్ వారి పాలన జరుగుతోంది. ఏమి చెప్పాలన్నా, చెప్పుకోవాలన్నా, అడగాలన్నా స్వేచ్ఛ, స్వతంత్రత లేని రోజులు. అప్పుడు ఈ కవి 'చక్కగా పాలిస్తున్న ఆరోగ్యంగా వున్న గోమాతను మన భరతఖండంతో పోలుస్తూ, పాల కోసం గగ్గోలు పెడుతున్న లేగదూడలను హిందువులతో పోలుస్తూ, లేగదూడల మూతుల వలె, మన మూతులు కూడా బిగియగట్టి, మన దేశ సంపదలను తెల్లవారు పాలవలె పితుక్కుని వ్యాపారం చేసుకుంటున్నారు' అని మహా గడుసుగా చెప్పిన భావన ఇది. ముఖ్యంగా "తెల్లవారను గడసరి గొల్లవారు" అనే పదం ఇటు తెల్లవారగానే అనే భావం, అటు బ్రిటిష్ వారు అనే భావం రెండూ స్ఫురించేలా రాయడం రచయిత గొప్పదనం.
జై హింద్. జై భారత్.
***************************************************
25
చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ,
బంగారు మొలత్రాడు, పట్టుదట్టి,
సందె తాయత్తులు, సిరిమువ్వ గజ్జెలు,
చిన్న కృష్ణా నిన్ను చేరి కొలుతు.
భావం: "చేతిలో వెన్నముద్ద పట్టుకుని, మెడలో చిన్న చెంగలువల మాల వేసుకుని, నడుముకి కాసెపోసి కట్టిన పట్టు పంచ, ఆపై బంగారు మొలత్రాడు ధరించి, చేతులకు రక్ష కోసం తాయతులు, కాళ్లకు చిరు సవ్వడి చేసే చిన్ని చిన్ని గజ్జెలతో, మనవైపుకి గునగునా పరుగున పాకుతూ వస్తున్న ఆ ముద్దు కృష్ణుని కొలుచుకుందామా". ఈ పద్యం అన్నమాచార్యుడు రాశాడని అంటారు. ఈ రూపంలో వుండే బాలకృష్ణుడిని ఉత్తరాదివారు లడ్డూగోపాల్ అంటారు. ఇస్కాన్ మందిరాల్లో ఈ లడ్డూగోపాల్ కే అన్ని రకాల అభిషేకాలు, ఊయల సేవలు, అలంకరణలు. అటువంటి ముద్దు గొలిపే కృష్ణుడి రూపాన్ని ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. హాయిగా ఆనందంగా లేదూ. జై శ్రీకృష్ణ!
కృష్ణాష్టమి ఎప్పుడు?
ఇది చాలా మంది అడిగే ప్రశ్న. కృష్ణుడు శ్రావణమాసంలో, కృష్ణపక్షంలో, అష్టమితిథి నాడు, రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. వామనద్వాదశి, రామనవమి జరుపుకున్న విధంగానే తిథుల ప్రకారం కృష్ణుడికి శ్రావణ బహుళ అష్టమి నాడు పుట్టినరోజు జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఏరోజు సూర్యోదయ సమయానికి అష్టమి ఉంటుందో, ఆ రోజే కృష్ణాష్టమిగా నిర్ణయించి పండుగ చేసుకోవడం ఒక ఆనవాయితీగా ఆచరించబడుతోంది. ఈ కృష్ణాష్టమినే జన్మాష్టమి, గోకులాష్టమి, అనడం కూడా వుంది. కానీ తిథులన్నవి పితృకార్య నిర్ధారణకు వాడాలి. జయంతులు వంటి శుభకార్యాలకు, దైవకార్యాలకు నక్షత్రం ముఖ్యం అనే వాదన కూడా వున్నది. చాలామంది వైష్ణవులు రోహిణీ నక్షత్రం ఏ రాత్రి వస్తుందో ఆ రాత్రి కృష్ణుడు పుట్టినట్టు భావించి ఆ మరునాడు కృష్ణుడికి పూజలు చేసి ఊయలలో వేసి సంబరం చేసుకుంటారు. అందువలన, తిథి ప్రకారం జరుపుకునేవారికి, నక్షత్రం ప్రకారం జరుపుకునేవారికి 2,3 రోజులు, ఒక్కోసారి 4 రోజులు కూడా తేడా వస్తుంది. ఎవరి పద్ధతి, ఆచారం వారిది. కాబట్టి ఏరోజు ఎవరికి ముఖ్యమో ఆరోజు చక్కగా శ్రీకృష్ణుని పుట్టినరోజు జరుపుకోవచ్చు. జై శ్రీకృష్ణ.
***************************************************
26
ప్రత్యక్షే గురవే స్తుత్యః,
పరోక్షే మిత్ర బాంధవాః,
కార్యాంతే దాస భృత్యస్య,
పుత్రః స్తుత్య కదాచన!
భావం: "గురువుని ప్రత్యక్షంగా ఎదురుగా నిలబడి స్తుతించాలి. మిత్రులని కానీ, బంధువులని కానీ వారి వెనుక పొగడాలి. పనివారిని, దాసదాసీలను పని అయిపోయినా తరువాతే మెచ్చుకోవాలి. కానీ, తాను కన్నపిల్లలను ఎప్పుడూ, ఎక్కడా పొగడకూడదు". ఇది మహాకవి భారవి తన తండ్రి ద్వారా తెలుసుకున్న జీవితసత్యం. దైవసమానుడైన గురువుకి కానీ, దైవానికి కానీ ఎదురుగా నిలబడి స్తోత్రం చేయాలి. దైవం ప్రసన్నుడై వరాలిస్తే, గురువు శిష్య వాత్సల్యంతో మంచి విద్యను బోధిస్తాడు. స్నేహితులని, బంధువులని వారి ముఖాన్నే మెచ్చుకుంటే ఇరువురికీ కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే పొగడ్త వారు మరొకరి ద్వారా తెలుసుకుంటే, తమ మంచితనం, గొప్పదనం మన ద్వారా ఇతరులకు కూడా తెలిసిందని ఎంతో ఆనందపడతారు. పనివారిని, భృత్యులను, వారు పని చేశాక, ఆ పని ఎంత బాగా చేశారో చెబితే, వారు ఎంతో సంతోషపడి, మనం మళ్ళీ పనికి పిలిచినా వెంటనే ఇష్టంగా వచ్చి ఆపని చేసి వెళతారు. అదే పొగడ్త మాత్రం కన్నపిల్లల విషయంలో ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే, ఆవిధంగా పిల్లల్ని పొగిడితే, వారు తృప్తిపడి ఆపైన ఏమీ నేర్చుకోరు, ఎదగరు. పైగా తల్లితండ్రులు తమ బిడ్డల్ని పొగిడితే బిడ్డలకు ఆయుక్షీణం అని ఒక నమ్మకం. అందుకే బిడ్డల్ని, పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ పొగడరాదు.
***************************************************
27
సీసము:
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు,
లక్షాధికారియైన లవణమన్నమె కాని, మెరుగు బంగారంబు మ్రింగబోడు,
విత్తమార్జన జేసి విర్రవీగుటె కానీ, కూడబెట్టిన సొమ్ము తోడరాదు,
పొందుగా మెరుగైన భూమి లోపల బెట్టి, దానధర్మము లేక దాచి దాచి,
తేటగీతి:
తుదకు దొంగల కిత్తురో దొరలకవునో,
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు,
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర!
భావం: "ఎంతటి గొప్ప ధనవంతుడైనా తల్లి గర్భము నుంచి రక్తమాంసాలు తప్ప ధనము కానీ, బంగారము గానీ తీసుకురాలేడు. అలాగే ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు కూడా కనీసం తాను స్వయంగా ఆర్జించిన సంపదలు కూడా తనతో తీసుకుపోనూ లేడు. ఎంత లక్షాధికారియైనా మామూలు భోజనమే కానీ, బంగారుకణికలు మింగలేడు కదా. నేను కదా ఇంత డబ్బు గడించాను, అని ఎంత విర్రవీగినా ఈ దాచిన సొమ్మేదీ వెళ్ళేటప్పుడు తనతో రాదు. ఎవరైనా సంపాదించిన సొత్తు ఏ దానధర్మాలూ చేయకుండా జాగ్రత్తగా భూమి లోపల గుంతలు తవ్వి దాచిపెడితే, ఏమవుతుందో కవి చెప్తున్నాడు. ఏవిధంగా అయితే తేనెటీగ పువ్వు పువ్వు నుంచీ తేనె సేకరించినా ఆ తేనె దానికి కాకుండా, ఆ తేనెపట్టు కొట్టినవాడికే దక్కుతోందో, ఈ విధంగా సేకరించి, దాచి దాచి ఉంచిన సొత్తు దాచినవారికి దక్కకుండా దొంగలకో, దొరలకో దక్కుతోంది. ఇది కవి శేషప్ప రాసిన నరసింహశతకంలో పద్యం. ఈ శతకం యొక్క మకుటం "భూషణవికాస! శ్రీధర్మపురనివాస! దుష్టసంహార! నరసింహ దురితదూర!"
***************************************************
28
హస్తస్య భూషణం దానం
సత్యం కంఠస్య భూషణం
కర్ణస్య భూషణం శాస్త్రం
భూషణైః కిం ప్రయోజనమ్
భావం: ఇది ఒక సంస్కృత సుభాషితం. "చేతికి అసలైన అలంకారం దానం చేయడం. కంఠానికి నిజమైన భూషణం సత్యం పలకడం. చెవికి చక్కని ఆభరణం శాస్త్రాలు వినడం. ఇవి కదా అసలైన అందాన్నిచ్చే ఆభరణాలు. ఇంతకన్నా ఇతర ఆభరణాల ప్రయోజనం ఏముంటుంది?" చేతిని దానం చేయడానికి, గళాన్ని సత్యం పలకడానికి, చెవిని శాస్త్రాలు వినడానికి వాడితే, అవి ఆ వ్యక్తికి అలంకారాలుగా భాసిస్తాయి. అంతే కానీ మామూలుగా భూషణాలు అని చెప్పుకునే వాటికి ప్రయోజనం ఏముందీ. అన్నీ
***************************************************
29
సర్వౌషధానాం అమృతం ప్రధానం
సర్వేషు సౌఖ్యేష్వశనం ప్రధానం
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం
భావం: "అన్ని ఔషధాల్లోకీ అమృతం ముఖ్యమైనది. అన్ని సుఖాలలోకీ రుచికరమైన భోజనసుఖం ముఖ్యం. అన్ని ఇంద్రియాల లోనూ కళ్లు ముఖ్యమైనవి. అన్ని అవయవాలలో కెల్లా శిరస్సు ప్రధాన అవయవం". ఈ శ్లోకం చాణక్యనీతి లోనిది.
ఈ శ్లోకానికే మరో పాఠాంతరం కూడా ఉంది.
సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం
షణ్ణం రసానాం లవణం ప్రధానం
భావవే నదీనాం ఉదకం ప్రధానం
భావం: అన్ని ఇంద్రియాలలోనూ కళ్లు ముఖ్యమైనవి. అన్ని అవయవాలలో కెల్లా శిరస్సు ప్రధాన అవయవం. ఆరు రుచుల్లోకీ ఉప్పు ముఖ్యం. ఉప్పుని రుచి అని కూడా అంటారు. నదికి ఉండవలసిన అనేక ధర్మాలలో దానిలో నీరుండటం అనేది ముఖ్యమైన ధర్మం.
***************************************************
30
వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, నిత్య వి
శ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడున్, సద
సభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యమున్
గ్రాసము లేని కొల్వు, కొఱగానివి పెమ్మయసింగధీమణీ!
భావం: ఇది పెమ్మయసింగధీమణీ అనే మకుటంతో వున్న చాటు పద్యం. ఈ పద్యంలో కొన్ని విషయాలు పనికిరానివి అని కవి చెప్తున్నాడు.
1. వాసన లేని పువ్వు: పువ్వుకి వాసన లేకపోతే, పూజకు పనికిరాదు. సువాసన లేదు, కనుక ఆహ్లాదమూ ఇవ్వదు.
2. బుధవర్గము లేని పురము: చక్కని వివేక విజ్ఞానము గల పౌరులు లేని వూరు.
3. నిత్య విశ్వాసము లేని భార్య: ఇక్కడ భార్య అంటే జీవితభాగస్వామి అని అర్ధం చేసుకోవాలి. కలిసి జీవితం అంతా గడపవలసిన భార్యాభర్తలకు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోతే కాపురం చేయడమే కష్టం.
4. గుణవంతుడు కాని కుమారుడు: ఇక్కడ కూడా కుమారుడు అంటే సంతానము అని అర్ధం చేసుకోవాలి. పిల్లలు గుణవంతులు కాకపోతే ఆ తల్లీతండ్రుల బాధ వర్ణింపలేనిది.
5. సదసభ్యాసము లేని విద్య: విద్య నేర్చుకోవడమే కాదు, దాన్ని వాడుకలో పెట్టకపోతే వ్యర్థం. నిత్యమూ దానిని పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి. స్థిరంగా ఉండే వ్యాపారమో, ఉద్యోగమో దొరికినా సరే, ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి ఆ విజ్ఞానాన్ని పునరధ్యయనం చేసుకుంటూ ఉండాలి.
6. పరిహాస ప్రసంగము లేని వాక్యము: విజ్ఞానంతో పాటు వినోదం కూడా కాస్తంత లేకపోతే, ఆ ప్రసంగం ఆకట్టుకోదు. కనుక హరికథల్లో పిట్టకథ ల్లాగా విజ్ఞానంతో పాటు వినోదం కూడా అవసరం.
7. గ్రాసము లేని కొల్వు: జీతం, భత్యం లేని ఉద్యోగం ఎంత పనికిమాలినదో, ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా. ఎవరైనా జీతం, భత్యం కోసమే కదా ఉద్యోగం చేసేది.
కనుక ఇవన్నీ దేనికీ పనికిరానివని కవి చెప్తున్నాడు.
***************************************************
31
న చోరహార్యం, న చ రాజహార్యం,
న భాతృ భాజ్యం , న చ భారకారీ,
వ్యయే కృతే వర్ధత ఏవ విద్యా,
విద్యాధనం సర్వధన ప్రధానం.
భావం: "దొంగలు దోచుకోలేనిదీ, రాజులు తమ బలము ద్వారా సంగ్రహించలేనిదీ, అన్నదమ్ములు పంచుకోలేనిదీ, ఏమాత్రమూ భారముగా ఉండనిదీ, ఖర్చు పెడుతున్న కొద్దీ అభివృద్ధి చెందే లక్షణములు కల విద్యాధనమే, అన్ని సంపదల కన్నా ప్రధానమైన సంపద". భర్తృహరి రాసిన ఈ శ్లోకానికి తెలుగు అనువాదం కూడా వుంది. 'లలిత సుగుణజాల తెలుగుబాల' అనే మకుటంతో కరుణశ్రీ అనే కలం పేరుతో శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు రచించారు.
దొరలు దోచలేరు, దొంగ లెత్తుకపోరు,
భ్రాతృజనము వచ్చి పంచుకోరు,
విశ్వవవర్ధనంబు విద్యాధనంబురా,
లలిత సుగుణజాల తెలుగుబాల.
భ్రాతృజనము వచ్చి పంచుకోరు,
విశ్వవవర్ధనంబు విద్యాధనంబురా,
లలిత సుగుణజాల తెలుగుబాల.
భావం: విద్య అనే సంపదను పాలకులు దోచుకోలేరు. దొంగలు దొంగలించనూ లేరు. సోదరులు, సోదరీమణులు ఆ సంపదను పంచమని ఎప్పటికీ అడగలేరు. ప్రపంచంలో అన్ని సంపదలలోకీ విద్యాధనం ఒక్కటే ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది.
***************************************************
32
స్వగృహే పూజ్యతే మూర్ఖః, స్వగ్రామే పూజ్యతే ప్రభుః,
స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే.
మూర్ఖుడికి ఇంట్లో మంచి గౌరవం లభిస్తుంది. ఎందుకంటే ఎంత మూర్ఖుడైనా మనవాడు కదా అని ముద్దు. ప్రభువుకి తన గ్రామంలో మాత్రమే గౌరవం దక్కుతుంది. ఎందుకంటే ఆ వూరిలో పరిపాలన చూసేది ఆ ప్రభువే కనుక ఆ గౌరవం. రాజుకు తన స్వదేశంలో మాత్రమే గౌరవం ఉంటుంది. ఆ ఎల్లలు దాటితే ఈ రాజు ఎవరో కొద్దిమందికి తప్ప, పక్క రాజ్యం వాళ్లకు కూడా తెలియదు. విద్వాంసుడికి మాత్రం ఎక్కడకు వెళ్లినా గౌరవం దక్కుతుంది. ఎందుకంటే విద్వత్తు అనేది ఎక్కడైనా పనికొస్తుంది, ప్రకాశిస్తుంది. ఎందుకంటే 'రవి కాంచని చోట కవి కాంచున్' అని శ్రీకృష్ణదేవరాయలు తన భువనవిజయంలో అన్నాడు కదా. ఇది భర్తృహరి సుభాషితం.
***************************************************
33 కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః । వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥ |
భావం: "ఏ పురుషునికైనా కేయూరాలు, చంద్రకాంతి సమానమైన ఉజ్జ్వలంగా మెరిసే హారాలు, పన్నీటిస్నానాలు, ఆపైన సుగంధలేపనాలు, కేశాలకు అలంకారంగా సౌగంధికా పుష్పాలు వంటి వేవీ అసలైన భూషణములు, అలంకారములు కాలేవు. పురుషునికి నిజమైన అలంకారము సంస్కరించబడిన వాణి (భాష) మాత్రమే. అంటే చక్కటి సంస్కృత భాష ఒక్కటే వాగ్భూషణం. ఇది తప్ప ఈ ప్రపంచంలో మిగిలిన ఏ భూషణములైనా నశించిపోయేవే". మనిషి ఎన్ని విలువైన ఆభరణాలు ధరించినా, ఎంత సుగంధాలు విరజిమ్మే లేపనాలు పూసుకున్నా, ఎంత గొప్ప సువాసనలను చిమ్మే పుష్పాలు ధరించినా, అవేవీ ఆ వ్యక్తికి మర్యాదను తేలేవు. ఎందుకంటే అవి ఎప్పటికీ అసలైన ఆభరణాలు కాలేవు. అసలు సిసలైన ఆభరణం ఆ వ్యక్తి మాట్లాడే భాష. సంస్కరింపబడిన భాషకే సంస్కృతం అని పేరు. వ్యక్తికి కేవలం తాను వాడే సంస్కారవంతమైన భాష మాత్రమే అసలైన ఆభరణం. ఈ ప్రపంచంలో మిగిలిన అన్ని అలంకారాలూ నెమ్మదిగా వాటి విలువను కోల్పోతాయి. ఇది భర్తృహరి నీతిశతకం లోనిది.
***************************************************
34
నానృషిః కురుతే కావ్యం,
నా రుద్రో రుద్రమర్చయేత్,
(పాఠాంతరం:నాగంధర్వ స్పురూపధృత్)
నాదేవాంశో దదాత్యన్నం,
నావిష్ణుః పృథివీపతిః.
భావం: మొదటిపాదం: ఋషి కానివారు కావ్యాలను రచించలేరు. కావ్యాలను రచించే పరిణతి రావాలంటే ఋషిత్వం కావాలి. అప్పుడే లోకహితానికి పనికొచ్చే కావ్యాలు రాయగలరు. రెండవపాదం: అలాగే రుద్రాంశ లేనివారు రుద్రుని పూజించలేరు. రుద్రుణ్ణి అర్చించాలంటే రుద్రతత్త్వం అర్ధం అయి, వారు స్వయంగా రుద్రుడిలా మారాలి. (ఈ పాదానికి ఒక పాఠాంతరం కూడా ఉంది. అదేమిటంటే గంధర్వాంశ లేనివారు గంధర్వునిలా అందమైన రూపం పొందలేరు) మూడవపాదం: దేవుని అంశ లేనివారు అన్నదానం చేయలేరు. అన్నదానం చేయాలన్న మనసు కలగాలంటే, ఆకలిగొన్న వాడి క్షుద్బాధను అర్ధం చేసుకునే దైవత్వం ఉండాలి. నాలుగవపాదం: విష్ణ్వంశ లేనివారు ఎప్పటికీ పాలకులు కాలేరు. పరిపాలన చేయాలంటే స్థితి కారకుడైన విష్ణువు అంశ తప్పనిసరిగా అవసరం. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరైనా పాలన జరపాలంటే ఆరాజుకి, లేదా ఈ రోజుల్లో అయితే మంత్రులకి విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక ఉంటుంది.
***************************************************
35
వందే వందారు మందారమిందిరానందకందలమ్
అమందానందసందోహ బంధురం సింధురాననమ్
అమందానందసందోహ బంధురం సింధురాననమ్
భావం: "భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్ష సమానమైన మందారమొక్క వలె, శ్రీమహాలక్ష్మి ఆనందానికి కూడా మూలకారణమై, తన వారందరితో కలిసి ఆనందంగా క్రీడిస్తున్న ఆ గజముఖునికి నమస్కరిస్తున్నాను". ఈశ్లోకం, కనకధారను కురిపించమని శ్రీమహాలక్ష్మిని ప్రార్ధించే ముందు, విఘ్ననివారణకై శ్రీశంకరభగవత్పాదులవారు ఆశువుగా చెప్పిన కనకధారాస్తవం లోని గణేశప్రార్ధన.
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే
భావం: ఈ శ్లోకం విఘ్నేశ్వరస్తుతిగా ప్రసిద్ధి. కానీ శ్లోకంలో ఎక్కడా ఆ వినాయకుని పేరు ఉండదు. "తెల్లనివస్త్రములు (శుక్లాంబర) ధరించి, సర్వవ్యాపకుడై (విష్ణుం), చంద్రకాంతితో (శశివర్ణం), నాలుగు భుజాలతో (చతుర్భుజం), ఆహ్లాదకరమైన ముఖం కల ఆ గణేశుని (ప్రసన్నవదనం కల ఆ విఘ్నహర్తను) సర్వ విఘ్నములు ఉపశమించుటకై (సర్వవిఘ్నోపశాంతయే), ధ్యానిస్తున్నాను (ధ్యాయేత్)". గణపతి ప్రసన్నవదనుడు కనుక ఈ శ్లోకం గణపతికి ఆపాదించి ధ్యానం చేస్తున్నాం.
***************************************************
36
విశ్వామిత్రాహి పశుషు,
కర్దమేషు జలేషు చ,
అంధే తమసి వార్ధక్యే,
దండం దశగుణం భవేత్.
భావం: దండం దశగుణం భవేత్ అనే మాట సాధారణంగా వింటూనే ఉంటాం. "పిల్లలను దండిస్తే, వాళ్ళు పది రకాలుగా భయపడతారు లేదా బాగుపడతారు" అని ఈ వ్యాక్యప్రయోజనంగా కూడా చెప్తూ వుంటారు. కానీ ఈ శ్లోకం అసలైన అర్ధం ఏమిటో తెలుసుకుందాం. దండం అంటే చేతికర్ర మనకు పది రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటి పాదంలో వి అంటే విహంగాలు, పక్షులు. పంటపొలాల్లో పక్షులను తోలడానికి, శ్వా అంటే శునకము, కుక్కలు, పిల్లులు వంటి జంతువుల నుంచి రక్షణకి, అమిత్ర అంటే మిత్రులు కానివారు, శత్రువులన్న మాట, వారి నుంచి కాపాడుకోవడానికి, అహి అంటే పాములు, కొండచిలువలు వంటి సరీసృపాల నుంచి రక్షించుకోవడానికి, పశుషు అంటే ఎద్దులు, దున్నలు, ఆబోతులు, ఆవులు, గేదెలు వంటి పశువులను దారిలో పెట్టి మళ్లించడానికి దండాన్ని అయిదు రకాలుగా వాడుకోవచ్చు. రెండవ పాదంలో కర్దమేషు అంటే బురద, ఊబి నెలల్లో నడిచేటప్పుడు, జలేషు నీటిచెలమలు, ఏర్లు మొదలైనవి దాటవలసి వచ్చినప్పుడు దండం చేతి ఊతకర్రగా ఉపయోగపడుతుంది. ఇక మూడవ పాదంలో అంధే కళ్ళు కనిపించని వారికి, తమసే చీకటిలో వెళ్లవలసి వచ్చినప్పుడు, వార్ధక్యే ముసలితనంలోనూ దండం సహాయం అవసరం. మొత్తం మీద దండం మనకు ఈ పది రకాలుగా పనికివస్తుంది. అందుకే అన్నారు దండం దశగుణం భవేత్ అని. మొత్తం శ్లోకం చెప్పకుండా కేవలం నాలుగో పాదం మాత్రమే చెప్పుకుంటే, అర్ధాలు మారిపోతాయి.
***************************************************
37
ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం,
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః,
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో,
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్.
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః,
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో,
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్.
ఆరాధనలో మమేకం అవడం అంటే, తాను స్వయంగా ఆ భగవత్ స్వరూపుడు కావాలి. “నా రుద్రో రుద్రమర్చయేత్” కదా. కనుకనే ఆత్మా త్వం. “యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితా”, కనుక నాలో వున్న ఆ బుద్ధి మరెవరో కాదు, సాక్షాత్తూ ఆ గిరిజా దేవియే. శివుడు ఏవిధంగా ప్రమథగణ పరివేష్టితుడై ఉంటాడో, అదే విధంగా మన శరీరంలో “ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ” అనే దశప్రాణాలు మన సహచరులు. అవి లేకపోతే జీవించలేము. “దేహో దేవాలయ ప్రోక్తః” అని కదా అనుకుంటాం. కనుక ఈ దేహమే శివాలయం, శివ నివాసం. ఏ పని చేస్తున్నా, నిరంతరం శివ నామస్మరణే మనసులో వుంటే, “నామస్మరణా ధన్యోపాయం, నహి పశ్యా మో భవతరణే” అన్నట్టు చేసే ప్రతి కార్యమూ, అనుభవించిన ప్రతి భోగమూ, ఈ భవసాగరాన్ని దాటడానికి చేసిన ప్రతి ప్రయత్నమూ ఆ శివునికే సమర్పణం. నిద్ర పోయేది శరీరం మాత్రమే, లోపల ఉన్న ఆత్మకు నిద్ర ఏదీ. అది నిత్యమూ మెలకువగా ఉంటూ శివునితో రమిస్తూనే ఉంటుంది కదా. అంతకన్నా గొప్ప సమాధి స్థితి లేదు. కనుక నిద్రే అత్యున్నతమైన సమాధిస్థితి. శివుడు లేని స్థలమేదీ. కనుక ఎటు నడచినా, ఎప్పుడు నడచినా, ఆ సంచారమంతా నేను నీకు చేస్తున్న ప్రదక్షిణములే శివా. నేను ఎల్లప్పుడూ పలికే పదములూ, పాటలూ, మాటలూ అన్నీ నీ(నా) స్తుతులే. ఈ జ్ఞానం వలన ఎల్లప్పుడూ పలికేది ఆ స్తో త్రాలే. హే శంభో, కనుక నేను ఏమి చేసినా, ఆ కర్మ సమస్తం నీ ఆరాధనమే. ఆదిశంకరుడు సాక్షాత్తూ శంకరునితో చేసిన సంభాషణ ఇది. ఆదిశంకరుడు ఈనాటికీ అందరికీ గురువు, మార్గదర్శి. ఆ శంకర మార్గంలో పయనిస్తే దొరికేది ఆత్మస్వరూపమైన శంకరుడే.
***************************************************
38
అచ్యుతానంతగోవింద, నామోచ్ఛారణ భేషజాత్,
నశ్యంతి సకలరోగాః, సత్యం సత్యం వదామ్యహం
భావం: శ్రీమహావిష్ణువుకు ఉన్న నామాలలో అచ్యుత, అనంత, గోవింద అనే నామాలు ప్రత్యేక మహత్తు కలవి. "ఈ నామాలు ఉచ్చరించినంత మాత్రాన అవి భేషజాత్, భిషక్కు (ధన్వంతరి) వలె పనిచేసి, సకలరోగాలను నశింపచేస్తాయి, ఈ మాట సత్యం, సత్యం" అని స్వయంగా అగ్నిదేవుడే చెప్పాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మహాదౌషధం ఈ మంత్రం. "ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః" అనే నామాలను నిత్యమూ స్మరిస్తూ ఉండటమే తరుణోపాయం. అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు. స్థిరంగా ఉండేవాడు, నాశము లేనివాడు. అనంతుడు అంటే అంతము లేనివాడు. అనంతశేషుడు. గోవిందుడు అంటే గోవులను రక్షించేవాడు, శ్రీకృష్ణుడు. ఈ నామాలన్నీ శ్రీ విష్ణుసహస్రనామాలలో వున్నవే. రోగంతో దిక్కు తోచక వున్నవారికి ఈ నామాలు అమృతంతో సమానం. అగ్నిపురాణం సిద్ధ ఔషధాలు, మంత్రరూప ఔషధాల గురించి వివరంగా చెప్పింది. ఈ "అచ్యుతానంతగోవింద" మంత్రం అగ్నిపురాణం లోనిది. కనుక రోగబాధ ఉన్నవారు నిత్యమూ "అచ్యుతానంతగోవింద" అనో, "ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః" అనో స్మరించడం ఔషధసేవనంతో సమానము. కనీసం రోజుకి 108 సార్లు 48 రోజులు చేయడం మంచిది.
***************************************************
39
విద్యా దదాతి వినయం, వినయాద్వాతి పాత్రతాం
పాత్రత్వాద్ధన మాప్నోతి ధనాద్ధర్మం తతస్సుఖమ్
భావం: ఇది ఒక సుభాషితం. "విద్య వలన వినయం లభిస్తుంది. వినయము వలన యోగ్యత వస్తుంది. యోగ్యత వలన ధనము లభిస్తుంది. ఆ ధనమును ధర్మ కార్యాలకు ఉపయోగించితే సుఖం కలుగుతుంది". ఏ వ్యక్తికైనా తుదకు కావలసింది సుఖమే కదా. చదువు వలన మనిషికి నమ్రత రావాలి. వినయంతో ప్రవర్తించేవారికి ఏపనైనా చేయగలిగే యోగ్యత, సమర్థత వస్తుంది. ఈ లక్షణాల వలన మంచి గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తూ వీరు ధనం సంపాదిస్తారు. వినయం కలిగిన ఈ యోగ్యులు, ఆ ధనాన్ని ధర్మకార్యాలకి వినియోగిస్తే, ఫలితంగా సమాజంలో మర్యాద, సుఖం కలుగుతాయి. ఎవరైనా గౌరవం, సుఖమే కదా కోరుకునేది. ఈ విధంగా విద్య వలన వినయం రానివారికి, అదే విద్య వలన గర్వం, అహంకారం వచ్చే ప్రమాదం ఉంది. ఆ అహంకారం వలన, ఇక ఆపైన రావలసిన మిగిలినవన్నీ రావు, ఆ విద్య వలన ఉద్యోగాలు, జీతాలు వచ్చినా, ఆ తరువాత సమాజంలో దక్కవలసిన ఆదరాభిమానాలు దక్కవు. అందువలన నిత్యం అసంతృప్తితో వేగిపోతూ శాంతం, సుఖం దొరక్క అసహనంతో దుర్భరమైన జీవితం గడుపుతూ ఉంటారు.
***************************************************
40
ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ,
దాన మానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః
భావం: ఏ వ్యక్తికైనా తొమ్మిది విషయాల్లో గోప్యత అవసరం అంటాడు చాణక్యుడు. "అవి తన వయసు, సంపాదన, గృహకలహాలు, సాధన చేసే మంత్రం, తపస్సు వివరాలు, సేవించే ఔషధము, తమ దంపతుల సమాగమ విశేషాలు, తనకు ఎదురైన సన్మాన, అవమానాలు రహస్యంగా ఉంచాలి" అని జాగ్రత్త చెప్పాడు చాణక్యుడు. వయసు వివరాలు, ఆస్తిపాస్తుల వివరాలు అందరికీ చెప్పకూడదు. అందువలన ఎవరైనా అప్పులు, ఆస్తిపాస్తులు ఆశిస్తే, వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి. అంతేకాక, బైటవారికి మన గృహకలహాలు కూడా తెలియనీయకూడదు. సమాజంలో మర్యాద పోతుంది. జనం చులకనగా చూస్తారు. అలాగే, తాను తీసుకునే మందుల గురించీ అందరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఆ మందు ద్వారా వ్యాధి గురించి తెలిసి, లేనిపోని సమస్యలు వస్తాయి. తాను ఉపాసన చేస్తున్న మంత్రం కానీ, చేస్తున్న తపస్సు, దేవత గురించి కూడా బహిర్గతం చేయకూడదు. శత్రువులకు ఈ వివరాలు తెలిస్తే, ఒక్కోసారి జపంలో అనుకోని ఆటంకాలు ఎదురై సాధన కుంటుపడచ్చు. అంతేకాదు, దాంపత్య సంబంధ విశేషాలు కూడా గుప్తంగా ఉంచాలి అని మరో జాగ్రత్త చెప్తున్నాడు. మన భారతీయ సంప్రదాయంలో పడకటిల్లు కేవలం భార్యాభర్తలకు మాత్రమే చెందిన ఏకాంతప్రదేశం. ఆ విశేషాలు బహిరంగం చెయ్యకూడదు. అంతే కాదు తనకు జరిగిన సన్మానాలు గురించి నలుగురితో చర్చిస్తే, ఈర్ష్య పడేవారి సంఖ్య పెరుగుతుంది. ఆ వెనుకే గుప్త శత్రువులూ పెరుగుతారు. అదే విధంగా తనకు కలిగిన అవమానాల గురించి చెప్పుకుంటే నలుగురిలో నగుబాటు అవుతుంది. పైగా శ్లోకంలో మనీషి అనే పదం వాడబడింది. మనీషి అంటే తెలివైనవాడు, విజ్ఞుడు అని అర్ధం. విజ్ఞుడైనవాడు తనకు సంబంధిన ఈ తొమ్మిది విషయాలూ గుప్తంగా ఉంచుకోవాలి అంటాడు చాణక్యుడు.
***************************************************
41
ఉత్తమం స్వార్జితం విత్తం,
మధ్యమం పితురార్జితం,
అధమం భాతృవిత్తం చ,
స్త్రీ విత్తమధమాధమం.
భావం: "స్వంతంగా సంపాదించిన ధనమే ఉత్తమమైనది. తాతతండ్రుల నుంచి సంక్రమించిన ధనము మధ్యమం. అన్నదమ్ముల సంపాదన ద్వారా సమకూరిన ధనం అధమం. స్త్రీల ధనాన్ని వాడుకుంటే అది అధమాధమం అని ఈ శ్లోకార్ధం. ఇది నీతిశాస్త్రం లోనిది". ఎవరికైనా తాము కష్టపడి సంపాదించిన సొమ్ము, అన్నివిధాలుగా ఉత్తమమైన సంపాదన అవుతుంది. ఎవరైనా స్వంతంగా డబ్బు సంపాదించుకుని జీవనం సాగించటం ఉత్తమమైన, మర్యాదపూర్వకమైన పధ్ధతి. కొంతమందికి ముందు తరాల వారు కూడబెట్టి ఇచ్చిన సంపద వారసత్వంగా వస్తుంది. ఆ సొమ్ముని ఈ శ్లోకంలో మధ్యమం అంటున్నారు. అంటే సొంత సంపాదన కన్నా కాస్త మర్యాద తగ్గుతోంది. వాళ్లకేంటి, పెద్దలు సంపాదించి ఇస్తే కూర్చుని తింటున్నారు అని నలుగురూ కాస్త చులకనగా చూస్తారు. కనుక ఇటువంటి బ్రతుకు మధ్యమం. ఇక మూడవ స్థానాన్ని అధమం అన్నారు. అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల ఆస్తిపై బ్రతికేవారిది. తనకు తానే సంపాదించుకున్నా, తల్లితండ్రులు ఇచ్చినా అదో మర్యాద. కానీ అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల ఆస్తిని దోచి దానిపై బ్రతికేవారిది అధమవర్గం. ఈనాటి సమాజంలో ఎంతమంది ఇటువంటి వారు కనిపిస్తారో కదా. ఇటువంటి ధనం అధమం. ఆ సంపాదనతో బ్రతికేవారు జీవితం కూడా అధమమే. ఇంతకన్నా అధమాధమమైన జీవితం ఏమిటంటే, స్త్రీ విత్తం పైన బ్రతికేవారిది. ఏపనీ చేయకుండా, తల్లో, చెల్లో, అక్కో, భార్యో, కూతురో సంపాదించి తెచ్చిన సొమ్ముని, లేదా వారికి సంబంధించిన ఆస్తినో అనుభవించే వారిది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసి ఇద్దరి సంపాదనా కలుపుకుని వాడుకుంటే, ఆ సంపాదనను వారి స్వార్జితం కిందనే లెక్క వేయాలి. అది కేవలం స్త్రీవిత్తం అనిపించుకోదు. కానీ ఏపనీ చేయకుండా, ఏమాత్రమూ సంపాదించకుండా తిని కూర్చునే వారి బ్రతుకు మాత్రం అధమాధమం అని ఈ శ్లోకార్ధం.
***************************************************
42
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికా
భావం: పైన చెప్పిన ఏడు పురాలూ మోక్షదాయికమైనవి అని గరుడపురాణం చెప్తోంది. అయోధ్య శ్రీరాముని జన్మభూమి. మథుర శ్రీకృష్ణుని జన్మభూమి. మాయా అంటే నేటి హరిద్వార్ నగరం. కాశీ నగరం విశ్వనాథుని క్షేత్రం. కాంచీపురం కామాక్షీ దేవి వెలసిన శక్తిపీఠం. కాంచీపురంలో ఎంతో ప్రభావవంతమైన శివ, విష్ణు ఆలయాలు కూడా యుగాల నుంచీ ఉన్నాయి. అవంతికా నగరం అంటే నేటి ఉజ్జయిని. ద్వారవతీ అంటే నేటి ద్వారకానగరం. ఈ ఏడు పురములూ మోక్షాన్నిచ్చే పుణ్యక్షేత్రాలు అని గరుడపురాణం చెప్పింది. ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువే స్వయంగా తన వాహనమైన గరుడుడికి చెప్పాడు. అయోధ్యలో సరయూనది, మథురలో యమునానది, హరిద్వార్ లోనూ, కాశీలోనూ గంగానది, ఉజ్జయినిలో క్షిప్రానది, ద్వారకానగరంలో గోమతీనది ఉన్నాయి. ద్వారకలో సముద్రం కూడా ఉన్నది. ఈ ఏడు పురాలనూ దర్శించి, అక్కడ ఉన్న పుణ్యనదులలో స్నానమాచరించి, ఆ క్షేత్రాలలో వున్న దేవీ దేవతలను దర్శించి, అర్చిస్తే మోక్షం లభిస్తుంది, అని గరుడపురాణం చెప్తోంది. ఈ ఏడింటిలో ఆరు ఉత్తరభారతదేశంలో ఉంటే, కాంచీపురం దక్షిణ భారతదేశంలో ఉంది. అవకాశమున్నవారు ఈ ఏడు క్షేత్రాలనూ దర్శిస్తే మోక్షం లభిస్తుంది.
***************************************************
43
గుహలలోన జొచ్చి, గురువుల వెదకంగ,
క్రూరమృగమొకండు తారసిలిన,
ముక్తిమార్గమదియె ముందుగా చూపురా
విశ్వదాభిరామ వినురవేమ.
భావం: ఎంతో సాధించేసిన గురువులు, గుహల్లో కూర్చుని, తపస్సు చేసుకుంటూ ఉంటారని భావించే అమాయకులను వేమన ఎగతాళి చేస్తున్నాడు. అవే గుహల్లో ఆకలితో వుండే క్రూరమృగాలు కూడా వుంటాయి, వాటి కంట పడితే, అవి వీరిని భోంచేసి, ఒకేసారి ముక్తిమార్గం చూపుతాయని హెచ్చరిస్తున్నాడు. క్రూరమృగాలంటే దొంగస్వాములు, దొంగగురువులు అని కూడా అర్ధం చేసుకోవాలి. అమాయకంగా ఇటువంటి దుష్టులను నమ్మితే ధన, మాన, ప్రాణాలకు నష్టం సుమా అని వేమన వెటకారంగా చెప్తున్నాడు. దొంగ గురువుల పట్ల తస్మాత్ జాగ్రత.
***************************************************
44
"రామః పరశురామశ్చ నృసింహా విష్ణురేవచ త్రివిక్రమః"
ఈ ఐదు నామాలను జపిస్తూ ఉంటే అన్ని రంగాలలో విజయం కలుగుతుంది అని అగ్నిపురాణంలో చెప్పారు. రాముడు, పరశురాముడు, నృసింహుడు, విష్ణువు, త్రివిక్రముడు ఈ నామాలను జపించడం ద్వారా కలిగే ఫలితం 'విజయం', అని అగ్నిపురాణంలో ఉంది. ఇవి అన్నీ విష్ణురూపాలే. త్రిమూర్తులలో విష్ణువు స్థితి కారకుడు, కనుక విష్ణునామ సంకీర్తన చేస్తే, విష్ణునామం జపిస్తే, విష్ణువును పూజిస్తే సర్వత్రా విజయం కలుగుతుంది. భక్తులను, ఆర్తులను ఉన్నస్థితి నుంచి ఉన్నతస్థితికి తీసుకునివెళ్లే శక్తే విష్ణుశక్తి. ఈ విష్ణునామాలను జపించండి. జపిస్తూనే ఉండండి. విజయాలను పొందండి.
***************************************************
45
సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం,
నిర్మోహాత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః
భావం: సత్సంగత్వం అంటే సజ్జనులతో సంగం, స్నేహం చేయడం. సతతమూ సజ్జనుల సాంగత్యంలో ఉండటం వలన, ఇతర వ్యర్ధ విషయాల పట్ల క్రమేపీ ఆకర్షణ నశిస్తుంది. నెమ్మదిగా అనవసర విషయాల పట్ల ఆసక్తి నశించి నిస్సంగత్వం అలవాటు అవుతుంది. తనలో తానే శాంతం, తద్వారా సుఖం పొందడంలో గల ఆనందం అర్ధం అవుతుంది. ఆ శాంతస్థితి యొక్క విలువ తెలుస్తుంది. ఆ స్థితిలో అన్నింటి పట్ల మోహం నశిస్తుంది. అటువంటి నిర్మోహత్వం ఒకసారి రుచి చూస్తే, ఈ భవసాగరంలో మిగిలిన విషయాలు అన్నీ ఎంత నిస్సారమైనవో తెలుస్తుంది. మోహనష్టం గురించి భగవద్గీతలో కూడా భగవానుడు స్వయంగా చెప్పాడు. అటువంటి నిర్మోహత్వంలో, నెమ్మదిగా దేనికీ, వేటికీ, ఎవరికీ చలించని ఒక స్థితి వస్తుంది. సంసారంలో ఉంటూనే దేనికీ అంటకుండా ఉండగలిగే, లేదా ఉండే ఒక నిరామయ స్థితి, అంటే నిశ్చలతత్వం వస్తుంది. ఆ నిశ్చలతత్వమే నెమ్మదిగా జీవన్ముక్తికి దారి తీస్తుంది. అందరికీ కావలసిందీ, అందరూ ఆశించేదీ జీవన్ముక్త స్థితి ఒక్కటే. ఆ స్థితి పొందడం ఏమాత్రమూ సులభం కాదు. అటువంటి దుర్లభ స్థితిని పొందడానికి ఈ సోపానాల ద్వారా ప్రయత్నించండి అని ఈ శ్లోకం చెప్తుంది. ఈ సోపానాలు తెలిసినంత మాత్రాన ఆ స్థితిని సాధించడం అనుకున్నంత తేలిక కాదు. భగవంతుని పాదాలు నమ్ముకుని, ఇదంతా ఒక తపస్సులా చేస్తే, లభించేది జీవన్ముక్తి. శంకరాచార్యుడు చెప్పిన మోహముద్గరలో ఇది ఒక శ్లోకం. ఈ శ్లోకంలో శంకరుడు మనిషి
జీవన్ముక్తి పొందడానికి ఒక అద్భుతమైన మార్గాన్నిసూచించాడు.
***************************************************
46
గురువు చిల్లగింజ కుంభమీ దేహంబు
ఆత్మ కలుష పంకమడుగు బట్ట
తెలసి విరిచెనేని దివ్యామృతము తేరు
విశ్వదాభిరామ వినురవేమ.
భావం: కుండలో ఉన్న బురద నీటిని శుభ్రపరచడానికి చిల్లగింజ వేస్తాము. ఆ చిల్లగింజ అడుగంటా పేరుకున్న కల్మషాన్ని విరిచి నీటిని తేటపరచి దానిని అమృతం వలె మారుస్తుంది. వేమన ఈ పద్యంలో కుండని మనిషి తోనూ, కుండలోని బురద నీటిని కలుషమయమైన ఆత్మ తోనూ, గురువును చిల్లగింజ తోనూ పోల్చాడు. కల్మషమైన ఆత్మని శుద్ధి చేయాలంటే, గురువు అనే చిల్లగింజ కావాలి. బురద నీటిలో చిల్లగింజ వేస్తే అది హంస పాలు, నీరుని వేరు చేసినట్టు, నీటిలోని బురదని నీటి నుంచి వేరు చేస్తుంది. అప్పుడు బురద కుండ అడుగున పేరుకుపోయి, జీవాధారమైన దివ్యామృతము వంటి స్వచ్ఛమైన మంచినీరు పైకి తేరుకుంటుంది. ఆత్మకు అంటుకున్న కల్మషాన్ని తొలగించడానికి గురువును ఆశ్రయించాలి. అప్పుడు గురువు చిల్లగింజ బురద నీటిని శుభ్రపరచినట్లు, కలుషాత్మను శుద్ధిచేసి అమృతాత్మను చేస్తాడు అని వేమన అంటున్నాడు.
***************************************************
47
ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః
న హి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః
భావం: ఏ కార్యమైనా కష్టపడి సాధించుకుంటేనే సాధ్యపడుతుంది. అంతేకానీ, కోరుకున్నంత మాత్రాన పనులు అయిపోవు. మనస్సు ఏది కోరుకుంటే అది జరిగిపోదు అని గ్రహించాలి. గొప్ప మనోరథాలు సిద్ధించాలంటే, ఉద్యమం చేసినట్టు పరిశ్రమించాలి. నిజమే కదా, ఎంత సింహాని కైనా గుహలో నిద్రపోతుంటే, దాని నోట్లోకి జింకలొచ్చి పడిపోవు. కనుక సింహానికైనా వేటాడితేనే ఆహారం దొరుకుతుంది. గుహల్లో సోమరిగా పడుకుంటే భోజనం దొరకదు. కనుక ఎవరైనా సోమరిగా కూర్చుని ఏ పనీ చెయ్యకుండా ఉంటే, వాళ్ళ కోరికలేవీ ఎప్పటికీ తీరవు. కోరికలు కోరుకోవడం దగ్గరే అంతా ఆగిపోతుంది. అవి సిద్ధించాలంటే మాత్రం, తప్పనిసరిగా నడుం బిగించి ఉద్యమంలా పని చెయ్యాలి. ఈ పద్యం హితోపదేశం లోనిది.
***************************************************
48
యాత్ర బోయిన వాడు ఎన్నాళ్ళు తిరిగినా,
పారమైన ముక్తి పదవి లేదు,
మనసు నిల్చినవాడు మహనీయ మూర్తిరా,
బాలచక్రవేమ భవ్యనామ.
భావం: యాత్రల పేరుతో ఎన్నాళ్ళు ఎన్నెన్ని తీర్థాలు తిరిగినా, పారలౌకిక ముక్తి మాత్రం దొరకదు. ఆ భగవంతుని మీద మనసు స్థిరంగా నిలుపగలిగిన వాడే అసలైన మహనీయమూర్తి అని వేమన ఈ పద్యంలో చెప్తున్నాడు. ఈ పద్యాన్ని ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే దీని మకుటం. వేమన పద్యాలు అన్నీ సాధారణంగా "విశ్వదాభిరామ వినురవేమ" అనే మకుటంతో ఉంటాయి. కానీ ఇతర మకుటాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో ఈ "బాలచక్రవేమ భవ్యనామ" మకుటం కూడా ఒకటి. దీనిని రచించినవాడు వేమన కాదు, అదే పేరుగల మరొక రచయిత అని కూడా పేరు ఉంది.
***************************************************
49
మూర్ఖస్య పంచ చిహ్నాని గర్వీ దుర్వచనీ తథా,
హఠీ చా అప్రియవాదీ చ పరోక్తం నైవ మన్యతే.
భావం: ఈ పద్యంలో మూర్ఖుల లక్షణాలు చెప్పారు.
1. గర్వీ: గర్వంగా ఉండటం. ఏ ప్రత్యేకతలు లేకపోయినా, తామేదో ఎక్కువ అన్నట్టు పొగరు చూపటం.
2. దుర్వచనీ: చెడ్డమాటలు మాట్లాడుతూ ఉండటం. ఎప్పుడూ చెడు విషయాలు మాట్లాడటం, ఇతరుల గురించి చెడు చెప్పటం, దాని వలన ఆనందం పొందటం
3. హఠీ: మొండితనం. పట్టు పట్టటం, మంకుతనం
4. అప్రియవాదీ: ఎప్పుడూ అప్రియమైన, హితకరం కాని మాటలు పలుకుతూ ఉండటం. అందరికీ దుఃఖం, కోపం కలిగే విధంగా మాట్లాడటం. ఇతరులకు నిరాశ కలిగేలా మాట్లాడటం
5. పరోక్తం నైవ మాన్యతే: ఇతరులు చెప్పిన దాన్ని గౌరవించకపోవడం, వినకపోవడం
మూర్ఖులను గుర్తించడానికి ఈ ఐదు లక్షణాలూ గమనించండి. మీలో ఈ లక్షణాలు ఉంటే వెంటనే వదిలించుకోండి.
***************************************************
50
ప్రియములేని విందు పిండివంటల చేటు,
భక్తిలేని పూజ పత్రి చేటు,
పాత్రమెఱుగని ఈవి బంగారు చేటురా,
విశ్వదాభిరామ వినురవేమ !
భావం: మనసులో ఏ ప్రేమాభిమానాలు లేకుండా పై పై చిరునవ్వులతో ఎంత గొప్ప విందు ఇచ్చినా, ఆ విందు వండి వడ్డించిన పిండివంటలకి చేటు, అంటే వృధా చేసినట్లే. అవే పిండివంటలు నిండు మనసుతో పెడితే సార్ధకం అవుతాయి. అదే విధంగా భక్తి లేకుండా, పైకి విపరీతమైన భక్తి ప్రదర్శిస్తూ ఎన్నెన్ని ద్రవ్యాలతో, ఎంతెంత పత్రితో పూజ చేసినా, అది అంతా కూడా దేనికీ పనికిరాదు. పత్రి చేటు అంటే, పత్రిని దండుగ చేయడమే. ఈ రెండింటితో పాటు ఇంకొక చేటు పని అని ఏమిటంటే, పాత్రత లేనివారికి బంగారు దానం చేసినా అది వృధా అని వేమన చెప్తున్నాడు. అపాత్రులకు చేసిన దానం మహాపాపం అని మన ధర్మశాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మనసులో ప్రేమ లేకుండా చేసే విందులు, భక్తి లేకుండా చేసే పూజలు, అపాత్రులకు చేసే దానాలు పనికిరాని పనులు అని ఈ పద్యం చెప్తోంది.
***************************************************
51
ఆరోగ్యమానృణ్యమవిప్రవాసః
సద్భిర్మనుష్యైః సహ సంప్రయోగః
స్వప్రత్యయా వృత్తిరభీతివాసః
షడ్జీవలోకస్య సుఖాని రాజన్
భావం: ఈ శ్లోకం మహాభారతం లోని విదురనీతి లోనిది. ఈ ఆరు లక్షణాలూ ఉంటే లోకంలో వ్యక్తులు ఎల్లప్పుడూ సుఖంగా ఉంటారని ఈ శ్లోకంలో చెప్పాడు.
ఆరోగ్య: అన్నివిధాలుగా ఆరోగ్యంగా ఉండటం,
అనృణ్య: అప్పులబాధ లేకుండా ఉండటం,
విప్రవాస: జీవనోపాధి కోసం దేశాంతరం, లేదా గ్రామాంతరం వెళ్ళవలసిన అవసరం రాకపోవడం,
సద్భిర్మనుష్యైః సహ సంప్రయోగః: సత్ప్రవర్తన కలవారితో స్నేహం చేయడం, కలసిఉండటం,
స్వప్రత్యయా వృత్తి: స్వంతంగా జీవనోపాధి సమకూర్చుకుని బ్రతకటం,
అభీతివాసః: ఏ భయమూ లేకుండా హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో జీవించడం.
కనుక ఈ ఆరు లక్షణాలూ పెంపొందించుకోండి. సుఖంగా జీవించండి.
***************************************************
52
ఈర్ష్యీ ఘృణీ త్వసంతుష్టః
క్రోధనో నిత్యశంకితః
పరభాగ్యోపజీవీ చ
షడేతే దుఃఖభాగినః
భావం: ఈ శ్లోకం నారాయణపండితుడు చెప్పిన హితోపదేశం లోనిది. ఈ ఆరు లక్షణాలూ ఉంటే లోకంలో వ్యక్తులు ఎల్లప్పుడూ దుఃఖితులై ఉంటారని ఈ శ్లోకంలో చెప్పాడు.
ఈర్ష్యీ: ఎప్పుడూ ఇతరులను చూసి ఈర్ష్యపడేవారు,
ఘృణీ: రోతగా, జుగుప్స కలిగించేలా ఉండేవారు,
త్వసంతుష్టః : ఎప్పుడూ అసంతృప్తితో ఉండేవారు,
క్రోధనో: ఎప్పుడూ అందరిపై కోపంతో ఉండేవారు కోపిష్టులు,
నిత్యశంకితః : ఎప్పుడూ అందరినీ అనుమానంతో చూసేవారు,
పరభాగ్యోపజీవీ: ఇతరుల సంపదపై ఆధారపడి జీవించేవారు, పరాన్నభుక్కుగా బ్రతికేవారు,
ఈ ఆరుగురు ఎల్లప్పుడూ దుఃఖితులే. కనుక ఈ ఆరు లక్షణాలూ దరి చేరకుండా జాగ్రత్త పడండి.
***************************************************
53
అర్చకశ్య తపోయోగాత్, అర్చకస్యాతి శ్యాయనాత్,
అభి రూప్యాచ్చ బింబానాం, దేవ సాన్నిధ్య మృచ్ఛతి.
తాత్పర్యము: :అర్చకుని తపస్సు, యోగము, వినయము, భక్తి ప్రపత్తులు, ఆచారము, మంత్ర సౌష్టవముల వలన దేవతా విగ్రహాములు దైవ సాన్నిధ్య శక్తిని గలిగి లోకానుగ్రహము కలిగించగలవు......మనుస్మృతి". ఈ శ్లోకం శ్రీశైలక్షేత్రం లోని శిఖరేశ్వర ఆలయంలో కనపడుతుంది. మనుస్మృతి లోనిదని తెలుస్తోంది. అర్చకునికి ఉండవలసిన లక్షణాలేవో ఈ శ్లోకంలో తెలుస్తుంది. అర్చకుడు తపస్సు చేయాలి. తపస్సు అంటే తపించడం, వేగిపోవడం. ఏ స్వామిని అర్చిస్తున్నారో ఆ స్వామి సేవలో పూర్తిగా లీనమై ఉండాలి. ఆ స్వామికి ఏమి కావాలి, ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే నిరంతర తపస్సులో ఉండాలి. యోగం లేకపోతే ఇవేవీ సాధ్యపడవు. ఆ యోగం పొందడానికి నిరంతరం కృషి చేయాలి. భగవంతుని పట్ల, భాగవతుల పట్ల వినయము కలిగి ఉండాలి. భక్తి, కలిగి ఉండాలి, భక్తి లేని పూజ పత్రి చేటు అని తెలుసు కదా. ప్రపత్తి కలిగివుండాలి. ప్రపత్తి అంటే శరణాగతి. ఏ స్వామిని సేవిస్తున్నారో ఆ స్వామిపట్ల 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ' అన్న భావాన్ని త్రికరణ శుద్ధిగాకలిగి ఉండాలి. ఆచారము పాటించాలి. శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రంలో 'ఆచార ప్రభవో ధర్మః' అన్నారు. సదాచారము నుండే ధర్మము ప్రభవిస్తుంది అని చెప్పారు. కనుక ధర్మాన్ని నిలబెట్టాలంటే ఆచారమును పాటించడం తప్పనిసరి. మంత్రాన్ని స్పష్ఠంగా ఉచ్చరించాలి. ఉచ్చారణలో దోషాలుంటే ప్రకంపనలలో తేడా వచ్చి, మంత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వదు. అప్పుడు ఆ మంత్రం సరిగా పనిచేయదు. కనుక ఉచ్చారణ సరిగ్గా ఉండాలి. ఈ లక్షణాలన్నీ అర్చకునిలో ఉన్నప్పుడు, ఆ అర్చకుడు అర్చన చేసే బింబములో, అంటే విగ్రహములో, దైవసాన్నిధ్యం చేకూరుతుంది. అంటే, అర్చకుడి వలననే విగ్రహానికి ఒక ప్రత్యేకశక్తి వచ్చి చేరుతుంది. కొన్ని ఆలయాలలో అందుకే నిజమైన దైవసాన్నిధ్య అనుభూతి కలుగుతుంది. అందుకే, దైవం తరువాత ఆ స్థానం ఆలయాల్లో నిస్సందేహంగా అర్చకునిదే.
***************************************************
54
లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
లోకస్థులుఁ దెగినఁ దుది నలోకం బగు పెం
జీకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుఁగు నతని నే సేవింతున్.
భావం: ఈ శ్లోకం పోతన రాసిన భాగవతం లోని గజేంద్రమోక్షం ఘట్టం లోనిది. సంపూర్తిగా తన శక్తి నశించింది అని గ్రహించిన గజేంద్రుడు శరణాగతి కోరుతూ ఎవరో, ఏమిటో తెలియని ఆ జ్యోతి స్వరూపుడిని రక్షణ కోరుతూ చెప్పిన పద్యం ఇది. "ఈ సమస్త లోకాలన్నీ దాటి, ఆ లోకాలను పాలించే లోకేశులనూ దాటి, ఆయా లోకాలలో జీవిస్తున్న లోకస్థులనూ దాటి, ఆ పైన ఏదీ అగుపడని అలోకమైన ఆ గాఢాంధకారాన్ని దాటి, ఆపై ఎవడైతే ఏకాకృతిలో జ్యోతి స్వరూపుడై వెలుగుతున్నాడో వాడినే నేను సేవిస్తాను" అని గజేంద్రుడు అనుకున్నాడు. ప్రాణాల మీద ఆశ పోయింది, దేహబలమూ పోయింది, అండగా వున్న సహచర బృందమూ పోయింది. తన పంచ జ్ఞానేంద్రియాలూ, పంచ కర్మేంద్రియాలూ, పంచ తన్మాత్రలూ, బుద్ధి, మనసు, చిత్తము, అహంకారము అన్నీ నశించాయన్న సంగతి అవగతం అయింది. ఇంక తనను ఈ లోకాలలో ఉన్న వారెవ్వరూ రక్షించలేరనే విషయం బోధపడిపోయింది. వీటన్నిటికీ పైనున్న ఆ ఖగోళమును దాటి మహా ప్రకాశవంతంగా వెలుగుతున్న ద్యుతి(కాంతి) ఏదున్నదో అదొక్కటే తనను రక్షించగలదన్న భావం ఏర్పడింది. అప్పుడు కలిగిన స్థితి, "అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ". ఆ వెలుగు స్త్రీ రూపమో, పురుష రూపమో, నపుంసక రూపమో తెలియదు. కానీ తనకు ఆ వెలుగు ఒక్కటే దిక్కన్న జ్ఞానం కలిగింది. అప్పుడు గజేంద్రుడు, "ఓ జ్యోతి స్వరూపమా, నేను నిన్ను సేవిస్తాను, నన్ను కాపాడు", అని ప్రార్ధించాడు. ఆ స్థితికి గజేంద్రుడు చేరుకోవడానికి ఎంత కష్టపడ్డాడో.
***************************************************
55
దాక్షిణ్యం స్వజనే దయా పరిజనే శాఠ్యం సదా దుర్జనే
ప్రీతిః సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవమ్ ।
శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ధృష్టతా
యే చైవం పురుషాః కళాసు కుశలాస్తేష్వేవ లోక స్థితిః ॥
ప్రీతిః సాధుజనే నయో నృపజనే విద్వజ్జనే చార్జవమ్ ।
శౌర్యం శత్రుజనే క్షమా గురుజనే కాంతాజనే ధృష్టతా
యే చైవం పురుషాః కళాసు కుశలాస్తేష్వేవ లోక స్థితిః ॥
భావం: ఈ శ్లోకం భర్తృహరి చెప్పిన నీతిశతకం లోనిది. ఈ పద్యంలో ఎవరితో ఎలా ప్రవర్తిస్తే నీతి అనిపించుకుంటుందో, లోకమర్యాదను పొందుతారో చెప్పాడు. సుమారు 5వ శతాబ్దానికి చెందిన భర్తృహరి చెప్పిన నీతిసూత్రాలు ఈనాటికీ ఎంత చక్కగా సరిపోతాయో గమనించండి. "మన అనుకునే వారి పట్ల దాక్షిణ్యం అంటే కృపతో ఉండాలి. అంటే వారికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ, వారికి కావలసిన పనులు చేసిపెడుతూ ఉండాలి. మనకు సేవచేసే పరిజనుల పట్ల దయతో ఉండాలి. వారి పట్ల కఠినంగా ఉండరాదు. దుర్జనుల పట్ల ఎప్పుడూ కఠినంగానే ఉండాలి. పొరపాటున కూడా దుర్జనుల పట్ల మంచితనం కూడదు. సాధుసంతుల పట్ల ప్రీతిపాత్రంగా వ్యవహరించాలి. స్నేహంగా, ప్రేమగా ఉండాలి. నృపులతో అంటే నేతలతో, నాయకులతో కాస్త నయముగా, మెత్తగా, లౌక్యంగా ప్రవర్తించాలి. విద్వాంసుల పట్ల పద్ధతిగా, సత్ప్రవర్తనతో, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి. శత్రువుల పట్ల పరాక్రమాన్ని ప్రదర్శించాలి. నా జోలికి వస్తే జాగ్రత్త అని స్పష్టంగా తెలియచేయాలి. పెద్దల పట్ల క్షమతో ఉండాలి. పెద్దవాళ్ళు చాదస్తంతో ఏమి చేసినా ఓర్పు వహించాలి. పురుషులు స్త్రీల పట్ల (స్త్రీలు పురుషుల పట్ల) స్థిరంగా, దృఢంగా వ్యవహరించాలి. ఈ లక్షణాలన్నీ ఎవరైతే కలిగిఉంటారో వారికి ఈ లోకం మర్యాదని ఇస్తుంది." అటువంటి వారి వలననే ఈలోకం నిలబడుతుంది. వారికే ఈ లోకమంతా అనుకూలంగా ఉంటుంది.
***************************************************
56
సంగీతమపి సాహిత్యం సరస్వాత్యా: కుచద్వయం
ఏకమాపాత మథురం అన్యదాలోచనామృతం
భావం: "సరస్వతీదేవికి ఉన్న రెండు స్తనములలో ఒకటి సంగీతాన్ని స్రవిస్తే, రెండవది సాహిత్యాన్ని స్రవిస్తుంది. మొదటిదైన సంగీతం ఆపాతమధురం అయితే, రెండవదైన సాహిత్యం ఆలోచనామృతం" అని ఈ శ్లోకం భావం. చక్కటి సంగీతాన్ని వింటూ ఉంటే, అది ఆపాతమధురం, అంటే ఎప్పుడు విన్నా మధురంగా ఉంటుంది, కర్ణపేయంగా ఉంటుంది. సాహిత్యాన్ని ఆలోచనామృతం అన్నారు. మంచి సాహిత్యం చదువుతూ ఉన్న కొద్దీ కొత్త కొత్త అద్భుతమైన ఆలోచనలు వచ్చి ఆ అమృతానందంలో మునిగి తేలుతూ ఉంటాం. ఈ శ్లోకంలో సరస్వతీదేవి తన పిల్లలకు ఇచ్చే స్తన్యమేమిటంటే, ఒక స్తనం నుంచి సంగీతం, మరో స్తనం నుంచి సాహిత్యం ఇస్తుంది అన్న భావన ఉంది. అందుకే, సంగీతకారులు, సాహిత్యకారులని సరస్వతీ పుత్రులని అంటూ ఉంటారు. ఆ జగజ్జనని స్తన్యం లభించడం ఎంతో అపురూపం. మహా భక్తుడు, జ్ఞాని, కవి జ్ఞానసంబంధర్ కి స్వయంగా పార్వతీదేవే తన స్తన్యం ఇచ్చి, మహాపండితుడిని చేసిందని గాధలు ఉన్నాయి. మూడోయేటి నుంచే కవిత్వం చెప్పిన కవి జ్ఞానసంబంధర్. అమ్మవారి స్తన్యం మహాత్మ్యం అది. సరస్వతీ పుత్రులకి అమ్మవారు ఇచ్చే వరం సంగీతం, సాహిత్యం. సరస్వత్యై నమః.
***************************************************
57
పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే (పీడతే)
తఛ్ఛాంతిః ఔషధైః దానైః జప హోమ క్రియాదిభిః
భావం: "పూర్వజన్మలలో చేసిన పాపం వ్యాధి రూపంలో బాధిస్తూ, పీడిస్తూ ఉంటుంది. ఔషధములు సేవించడం, దానములు, జపములు, హోమములు చేయడం లేదా చేయించడం వలన ఆ బాధకు శాంతి కలుగుతుంది". ఎంతోమంది ఎప్పటికీ తగ్గని, బాగా వేధించి బాధపెట్టే అనారోగ్యంతో జీవితంలో ఎక్కువకాలం యాతన పడుతూ ఉంటారు. అటువంటివారు ఎప్పుడూ తమకే ఎందుకిలా అయిందీ అని దుఃఖపడుతూ ఉంటారు. ఏ పూర్వ జన్మల్లో చేసిన పాపమో ఈ విధంగా వ్యాధుల రూపంలో వేధిస్తుంది అని శాస్త్రవచనం. అదే శాస్త్రం ఆ పీడ నుంచి శాంతిని పొందడానికి నాలుగు ఉపాయాలూ చెప్పింది. అవి మొదటగా ఔషధాలు తీసుకోవాలి. ఇంకా ఆ వ్యాధి శాంతించకపోతే దానాలు, జపాలు, హోమాలు చేయాలి, లేదా చేయించాలి. ఇవి ఎవరి చేత్తో వారు చేసుకోవడమే శ్రేష్టం. ఎవరైనా రోగతీవ్రత వలన కానీ, మరొక ఇబ్బంది వలన కానీ స్వహస్తాలతో చేయలేకపోతే, ద్రవ్యము, ధనము ఇచ్చి ఈ సంకల్పంతో మరొకరి చేత చేయించుకున్నా కూడా ఫలితం వస్తుంది.
***************************************************
58
వనే రణే శత్రు జలాగ్ని మధ్యే
మహార్ణవే పర్వత మస్తకే వా ।
సుప్తం ప్రమత్తం విషమ స్థితం వా
రక్షంతి పుణ్యాని పురాకృతాని ॥
మహార్ణవే పర్వత మస్తకే వా ।
సుప్తం ప్రమత్తం విషమ స్థితం వా
రక్షంతి పుణ్యాని పురాకృతాని ॥
భావం: కీకారణ్యంలో దిక్కుతోచక ఉన్నపుడు, యుద్ధభూమిలో పోరాడుతున్నపుడు, శత్రువులు చుట్టు ముట్టినపుడు, నీటి ప్రవాహం మధ్యలో చిక్కుకున్నప్పుడు, అగ్నికీలలు చుట్టూ వ్యాపిస్తున్నపుడు, మహాసముద్రం మధ్యలో నిస్సహాయంగా ఉన్నపుడు, ఎత్తైన పర్వత శిఖరాలపై ఉన్నపుడు, ఆదమరచి నిద్ర పోతున్నప్పుడు, అప్రమత్తంగా, అజాగ్రత్తగా ఉన్నపుడు, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు, రక్షించేది కేవలం పురాకృతాని పుణ్యాని, అంటే గతంలో చేసుకున్న పుణ్యం మాత్రమే అని అర్ధం. కనుక ఎవరినైనా, ఎప్పుడైనా, ఎటువంటి ఆపత్కాలంలో అయినా రక్షించేది వారు పూర్వం చేసుకున్న పుణ్యమే. ఆ పురాకృత పుణ్యబలం మాత్రమే కష్టాల నుంచి కాపాడి గట్టెక్కిస్తుంది. ఈ శ్లోకం భర్తృహరి చెప్పిన నీతిశతకం లోనిది.
***************************************************
59
నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి,
అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్
భావం: చేసిన కర్మ శతకోటి కల్పాలైనా క్షీణించదు, అది శుభకర్మ అయినా, అశుభ కర్మ అయినా అని శాస్త్రవచనం. ఎప్పటికైనా కర్మ ఫలితాన్ని అనుభవించవలసినదే. దానినుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. సాక్షాత్తూ ఆ రామకృష్ణులకు, పార్వతీదేవికి కూడా కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. భృగుపత్నిని సంహరించిన కారణాన, భృగుశాపం వలన, రాముని అవతారంలో భార్యావియోగం అనుభవించాడు రాముడు. రాముని అవతారంలో వాలిని వేటాడినందుకు, కృష్ణావతారంలో బోయవాడి బాణం కాలి బొటనవేలికి తగిలి అవతారం చాలించాడు కృష్ణుడు. పార్వతి కేళిగా ఒక్కక్షణం శివుని కన్నులు మూసినందుకు, భూలోకంలో పుట్టి శివుని కొరకు తపస్సు చేసి, ఆ కర్మ పరిపాకం అయిన తరువాతే శివుణ్ణి చేరుకుంది. ఎందుకంటే శివుడు ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే విశ్వమంతా కొన్ని కల్పాల పాటు చీకటిలో మునిగిపోతుంది. కనుక ఎంతటివారు అయినా చేసిన ఏకర్మ అయినా అనుభవించి తీరవలసిందే. మానవమాత్రులం మనమెంత.
***************************************************
60
కర్మణా జాయతే భక్తిః భక్త్యా జ్ఞానం ప్రజాయతే
జ్ఞానాత్ప్రజాయతే ముక్తిః ఇతి శాస్త్రార్థ సంగ్రహః
భావం: కర్మ వలన భక్తి , భక్తి వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి లభిస్తుంది అని సర్వశాస్త్ర సిద్ధాంత సారము. ఆ విధంగా ముక్తికి దారి తీసే కర్మ నిష్కామంగా ఉండాలి. కేవలము నిష్కామ కర్మాచరణ వలన మాత్రమే భగవద్భక్తి వస్తుంది. అప్పుడు భగవదనుగ్రహం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. అటువంటి ఆత్మజ్ఞానము మాత్రమే బంధాల నుంచి విముక్తులను చేసి మోక్షానికి దారి చూపిస్తుంది. మోక్షం లభించాలంటే ఈ మార్గాన్ని శ్రీమద్భగవద్గీత సూచిస్తోంది. కర్మను మానకూడదు, కానీ నిష్కామ కర్మ చెయ్యాలి. నిజమైన భగవద్భక్తిని పొంది ఆ అపూర్వ భగవత్విభూతిని అనుభవించాలి. అటువంటి భక్తి ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది, ఆత్మానందాన్ని అనుభవించాలి. ఆ స్వచ్ఛమైన ఆత్మానందమే మోక్షానికి మార్గమవుతుంది. సర్వ శాస్త్రాలూ చెప్పేది ఇదే.
***************************************************
61
మాతృవత్ పరదారేషు, పరద్రవ్యేషు లోష్టవత్,
ఆత్మవత్ సర్వభూతేషు, యః పశ్యతి స పండితః
భావం: ఈ శ్లోకం హితోపదేశం లోనిది. ఈ శ్లోకంలో అసలు సిసలైన పండితుడి లక్షణాలను చెప్పాడు కవి. పరదారలను అంటే పరస్త్రీలను, ఇతరుల భార్యలను మాతృవత్ అంటే తల్లి వలె గౌరవంగా చూడాలి. పర ద్రవ్యాలను, అంటే ఇతరుల సొత్తును లోష్టవత్ అంటే మట్టిముద్ద వలె భావించాలి. తనను తాను ఎలా భావిస్తాడో, ప్రేమిస్తాడో, అదే విధమైన ధోరణి సకల జీవుల పట్లా చూపాలి. ఈవిధంగా ఎవరైతే చూడగలరో వారే పండితులు. ఈ రోజుల్లో ఈ లక్షణాలేమీ లేనివారు కూడా పండితులుగా చలామణీ అవడం చూస్తూనే వున్నాము. పండితులను గుర్తించి గౌరవించండి. అపండితులనూ, కుపండితులనూ దూరం పెట్టండి.
***************************************************
62
విద్యా మిత్రం ప్రవాసేషు, భార్యా మిత్రం గృహేషు చ,
వ్యాధితః ఔషధం మిత్రం, ధర్మో మిత్రం మృతస్య చ.
భావం: ప్రవాసంలో ఉన్నవారికి విద్యయే స్నేహితుడు. అంటే సంపాదించిన జ్ఞానమే పరాయి ప్రాంతాల్లో తోడుగా ఉండే స్నేహితుడు. అదే ఇంట్లో ఉన్న సమయాల్లో భార్య (భర్త) మిత్రుడు. ఇంట్లో ఎప్పుడూ కలసిమెలిసి ఉండవలసింది వీరే కదా. కొన్నేళ్ల సాహచర్యంలో భార్యాభర్తలు మంచిమిత్రులై పోతారు. అలా అయిపోవాలి కూడాను. ఆ విధంగా ఆలుమగలు స్నేహితులైతే, ఆ దాంపత్యం స్వర్గతుల్యం. వ్యాధితో బాధపడుతున్న వారికి ఔషధమే ఆత్మీయ మిత్రుడు. ఎంతమంది చుట్టూ ఉన్నా, రోగికి కావలసింది మందే కదా. అందుకే రోగికి ఉపయోగకరమైన మిత్రుడు ఔషధమే. మరణించిన వారికి వారు చేసుకున్న ధర్మమే సదా వెంట ఉండే మిత్రుడు. "చేసిన ధర్మము, చెడని పదార్ధము, చేరును నీ వెంటా" అంటుంది తత్త్వం. మరణం తరువాత కూడా ఆ జీవికి వెంట వచ్చేది ఈ ఒక్క ధర్మమే. ఇహం లోనే కాకుండా పరం లోనూ మనల్ని అంటిపెట్టుకుని ఉండేది మనం చేసుకున్న ధర్మమే. ఈ లోకం లోనే కాకుండా పరలోకం లోనూ చలామణీ అయ్యే ఏకైక దినుసు ధర్మం. కనుక ఎంత ధర్మబద్ధంగా జీవిస్తే, ధర్మం ఖాతా అంత పెరుగుతుంది. ధర్మంగా జీవించండి, ఇహ, పర లోకాలలో హాయిగా ఉండండి. ఈ శ్లోకం చాణక్యనీతి లోనిది.
***************************************************
63
వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి
లోకోత్తరాణాం చేతాంసి కో హి విజ్ఞాతు మర్హతి
భావం: ఈ శ్లోకం రామాయణం లోనిది. కొంతమంది ఎప్పుడూ వజ్రం వలె కఠినంగా ఉంటారు. కొంతమంది ఎప్పుడూ కుసుమం వలె మృదువుగా ఉంటారు. ఎందుకు కొందరు కఠినంగా ఉంటారో, ఎందుకు కొందరు మృదువుగా ఉంటారో, సాధారణంగా సామాన్యులకు ఎవరికీ అర్ధం కాదు. కానీ లోకోత్తరులైన మహానుభావులు కొందరు సందర్భాన్ని బట్టి కఠినం గానూ ఉండగలరు, మృదువు గానూ ఉండగలరు. సహజంగా మృదుస్వభావి అయిన సీత, రావణుడు పట్ల ఎంత నిష్కర్షగా, కఠినంగా ఉండాలో చూపించింది. రావణుడంతటి వాణ్ణి గడ్డిపరక వలె తీసిపారేసింది. కారణం: కొంతమందితో కఠినంగా మాత్రమే ఉండాలి. పొరపాటున కూడా వారి పట్ల జాలి చూపకూడదు. ఆ విధంగా జాలి చూపి, మృదువుగా ప్రవర్తిస్తే, ఫలితాలు భయంకరంగా ఉంటాయి. కనుకే రామాయణంలో సీత హృదయాన్ని 'వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి' అని వర్ణించారు. ఇటువంటి గొప్పవారి మనసులను సామాన్యులు అర్ధం చేసుకోలేరు అని ఈ శ్లోకం చెప్తోంది. కానీ 'వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి' అనే తత్త్వం అందరూ అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. పాటించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కదా. కొంతమందితో కఠినంగా ఉండాలి, కొంతమంది పట్ల మృదువుగా ఉండాలి. ప్రతివారూ ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని మసలాలి.
***************************************************